ఉర్దూ ఎవరి భాష? ఈ అంశం మీద రాసిన కథల పుస్తకంతోపాటూ సుప్రీం కోర్టు వెలువరించిన ఓ తీర్పు నన్ను ఆకర్షించాయి. ‘whose urdu.. is it anyway’ అన్న కథల పుస్తకంలో 16 కథలు ఉన్నాయి. ఉర్దూలో రాసిన కథలకి ఇంగ్లిష్ అనువాదం ఇది. ఈ కథలను అనువదించి, ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన వ్యక్తి రక్షానంద జలీల్. ఈ కథలు అన్నీ ముస్లింలు కాని రచయితలు రాసినవే. క్రిష్ణచందర్, గుల్జార్, రాజేందర్ సింగ్ బేడీ లాంటి కథకుల కథలెన్నో ఇందులో ఉన్నాయి. క్రిష్ణ చందర్ కథతో మొదలై గుల్జార్ రాసిన కథతో ముగుస్తుంది. ఇది విస్తృతమైన సంకలనం కాదని జలీల్ తన ముందుమాటలో చెప్పుకున్నారు. ఈ కథల పుస్తకానికి సంపాదకులు రాసిన ముందుమాట ఆలోచింపజేస్తుంది. కథల పుస్తకం పేరే ఆలోచింపజేస్తుంది. ఇ క తీర్పు విషయానికి వస్తే అది మిసెస్ వర్షబాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు 2025 లైవ్ లా(సుప్రీం కోర్టు) 427. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉర్దూ భాష గురించి చెప్పిన విషయాలు కూడా మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆనందింపజేస్తాయి కూడా.
మరాఠీ, హిందీ భాషల మాదిరిగా ఉర్దూ కూడా ఇండో, ఆర్యన్ భాష. అది విదేశీ భాష కాదు. అది ఇక్కడే పుట్టింది. ఇక్కడే అభివృద్ధి చెందింది. ఇదీ తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానం. కథల పుస్తకాన్ని గుల్జార్‌కి అంకితం ఇచ్చారు. దాంతోపాటు ఉర్దూ గురించి గుల్జార్ చెప్పిన మాటలని ఉటంకించారు. అవి ఇలా ఉంటాయి.
మే కైసా ఇస్క్ హై ఉర్దూ జవాన్ కా
మజా గుల్తా హై లాజ్ఫాన్ కా జబాన్ పర్
కిజైసే పాన్ మే మహంగ్ గమ్ గుల్తా హై
కౌ కైసే ఇస్క్ హై ఉర్దూ జవాన్ కా..
ఉర్దూ భాష మీద అంత ప్రేమ గుల్జార్‌కి. ఉర్దూ పదాలు నాలుక మీద ఆనందంతో తిరుగుతాయి. ఖరీదైన గమ్ తమలపాకులలో తిరుగుతున్నట్టు. ఇదే ఉర్దూ భాష మీద ఉన్న ప్రేమ. ఇంతమంది ప్రేమిస్తున్న ఉర్దూ ఎవరి భాష? ముస్లింల భాషనా? భారతీయ ముస్లింల భాషనా? పాకిస్తాన్లో ఉన్న ముస్లింల భాషనా? మన దేశంలోని ఉత్తర భారతదేశపు భాషనా? మైనారిటీ ముస్లింల భాషనా? ఒకప్పుడు ఉర్దూకి పుట్టినిల్లు అయిన దక్కన్ పీఠభూమి సంగతి ఏమిటి? దక్షిణ భారతదేశం ఉర్దూని కోరుకోదా? భోపాల్ కోరుకోదా? తెలంగాణ కోరుకోదా? ఒకప్పుడు వలీ దక్కనీని తన ముద్దు బిడ్డగా గర్వంగా చెప్పుకున్న గుజరాత్ సంగతేమిటి? అసలు ఈ ఉర్దూ ఎవరిది? ఇవీ ఉర్దూ ఎవరిది అన్న కథల పుస్తక సంపాదకులు రక్షానంద జలీల్ తన ముందుమాటలో రాసిన ప్రశ్నలు.
బౌగోళిక విషయాలను దూరంగా పెడితే ఉర్దూపై ఎవరు హక్కులు సాధించగలరు? కవులూ, రాజకీయ నాయకులు మాత్రమే ఉర్దూ భాష మాట్లాడగలరా? రొమాన్స్, విప్లవం గురించి పాటలు పాడే కవులది మాత్రమేనా ఉర్దూ? తమ ప్రసంగాలకి ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఉపయోగించుకునే రాజకీయ నాయకులది మాత్రమేనా ఈ ఉర్దూ భాష? హమ్ దేఖేంగే, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలు కోరుకునే వారికి ఉర్దూ భాష ఇష్టమా? ఉర్దూ కవిత్వంతోపాటు ఉర్దూ గద్యం ఎలా ఉంది? ఉర్దూ జర్నలిజమ్ మాటేమిటి? ఈ ప్రశ్నల నేపథ్యంలో ‘ఎవరిది ఉర్దూ’ అన్న కథల పుస్తకాన్ని వెలువరించారు.
రాబోయే సంవత్సరాల్లో ఉర్దూ ఎలా మనుగడ కొనసాగిస్తుందో చూడాలి. ఉర్దూ భాషని ముస్లింలతో ముడిపెట్టి చూస్తున్నంత కాలం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. ఇది ముస్లింకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. భాషకు సంబంధించిన అంశం.ఇక తీర్పుని పరిశీలిస్తే ఈ తీర్పుని జస్టిస్ సుదాన్షు ధూలియా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వెలువరించింది. ఉర్దూ భాష వాడకం అంటే సమర్థవంతమైన సంభాషణ మాత్రమేనని, భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని కోర్టు అభిప్రాయపడింది.
ఉర్దూ పరాయి భాష కాదు: సుప్రీం
ఉర్దూ భాష మనకు పరాయిది కాదు. ఇది ఇక్కడే పుట్టి, ఇక్కడే వర్ధిల్లింది. ఉర్దూ పరాయి భాష అన్న అపోహ నుండి పక్షపాతం పుడుతుంది. ఉర్దూ ఈ గడ్డపై పుట్టిన భాష. విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన ప్రజలు తమ భాషలను పంచుకోవడానికి, సంభాషించుకోవడానికి అవసరమై పుట్టిన భాష ఉర్దూ. మన దేశంలో ఉర్దూ అభివృద్ధి చెంది వర్ధిల్లింది. తరువాత కాలంలో మరింత మెరుగుపడి ప్రఖ్యాత కవులకి, రచయితలకి ఇష్టమైన భాషగా మారింది.
మన దేశంలోని సామాన్య ప్రజలు ఉపయోగించే భాషలో ఉర్దూ భాష పదాలు లెక్కకు మించి ఉన్నాయి. అవి వారికి తెలియకపోవచ్చు. హిందీ భాషలో రోజువారి సంభాషణ ఉండదనడం సరైంది కాదు. ఉర్దూ పదాలు లేకుండా, ఉర్దూ నుంచి వచ్చిన పదాలు లేకుండా హిందీ భాష కూడా లేదు. ఆ మాటకొస్తే ‘హిందని’ అన్న పర్షియన్ పదం నుంచి హిందీ వచ్చింది. భారతీయ భాషల నుంచి ఎన్నో పదాలను ఉర్దూ భాష స్వీకరించింది.
మరీ ముఖ్యంగా సంస్కృతం నుంచి ఎన్నో పదాలు వచ్చి ఉర్దూలో చేరాయి. కోర్టు పరిభాషలో కూడా ఎన్నో ఉర్దూ పదాలు, పద బంధాలు వచ్చి చేరాయి.అదాలత్, అలఫ్నామా, పేషీ, రిట్ ఇలా పేర్కొంటూపోతే ఎన్నో పదాలు. రాజ్యాంగంలోని 348 ప్రకారం సుప్రీం కోర్టు అధికారిక భాష ఇంగ్లీషు అయినప్పటికీ ఉర్దూ పదాలు ఎన్నో కోర్టు పరిభాషలో ఉన్నాయి.
భాష మతం కాదు
భాష అనేది మతం కాదు. అది మతానికి ప్రాతినిధ్యం వహించదు. భాష అనేది ఒక ప్రాంతానికి, ఒక సమాజానికి, ప్రజలకి చెందుతుంది. మతానికి కాదు. భాష అనేది ఒక సంస్కృతి, ప్రజల నాగరిక ప్రగతిని కొలవడానికి ఒక కొలమానం. గంగా జమునా తెహజీబ్ల సంస్కృతికి అత్యుత్తమ నమూనా ఉర్దూ. భాష మనం అభ్యసించడానికి ఒక సాధనంగా మారకముందు అది కమ్యూనికేషన్‌కి ఉపయోగపడింది. ఈ తీర్పు మౌలౌద్ బెంజాది చెప్పిన ఒక మాట ద్వారా మొదలవుతుంది.
మీరు ఒక భాషను కేవలం మాట్లాడడం, వ్రాయడం కోసం మాత్రమే నేర్చుకోరు. మానవ జాతి పట్ల విశాల దృక్పథం, ఉదారత, సహనం, దయ, సానుభూతి ఉండటానికి నేర్చుకుంటారు. భాష ఎవరిదైనా ఏ భాష పట్ల విముఖత ఉండడానికి వీల్లేదు. ప్రతి భాషా బతకాలి. పరిఢవిల్లాలి. ఉర్దూ అనేది ముస్లింల భాష అనే అభిప్రాయాన్ని తుడిచి వేయడానికి ‘ఎవరి భాష ఉర్దూ?’ అన్న కథా సంకలనం ఉపయోగపడుతుంది. ఈ సంకలనం వెలువరించిన రక్షానంద జలాల్ని అభినందించా ల్సిందే. ఎందుకంటే ఇందులోని 16 కథలు ముస్లింలు కాని వ్యక్తులు ఇష్టంగా ఉర్దూలో రాసినవి.
- డా. మంగారి రాజేందర్,
కవి, రచయిత
9440483001
