- ప్రధానాలయం చుట్టూ దివ్యరథంలో విహరించిన లక్ష్మీనారసింహుడు
- ఉదయం శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారు
- గురువారంతో ముగిసిన అలంకార, వాహన సేవలు
- నేడు పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్న అర్చకులు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు ముగిసిన అనంతరం రాత్రి 7.30 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రధానాలయ పశ్చిమ రాజగోపురం ఎదుట రథం ముందు ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు రథాంగ హోమం, రథబలి జరిపారు.
తర్వాత లక్ష్మీనారసింహులను రథంలో అధిష్ఠింపజేసి అర్చకుల మంత్రోచ్ఛరణలు, సన్నాయి మేళాలు, మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగించారు. రథోత్సవం జరుగుతున్నంత సేపు భక్తుల జయజయ ధ్వానాలతో ఆలయ తిరువీధులు మారుమ్రోగాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ పాల్గొన్నారు.
శ్రీమహావిష్ణువు అలంకారంలో నారసింహుడు
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనారసింహుడు గురువారం శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై ఆశీనుడైన యాదాద్రీశుడు ప్రధానాలయ తిరువీధుల్లో విహరించారు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట స్వామివారి సేవను అధిష్ఠింపజేసి గరుత్మంతుడు, విష్ణుమూర్తి మహిమలను ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 20న మొదలైన స్వామివారి అలంకార, వాహన సేవలు గురువారంతో ముగిశాయి.
ఇయ్యాల పూర్ణాహుతి, చక్రస్నానం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజైన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని జరపనున్నట్లు అర్చకులు తెలిపారు.
