అక్రమంగా మట్టి తవ్వితే క్రిమినల్ కేసులు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్రమంగా మట్టి తవ్వితే క్రిమినల్ కేసులు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  •     సుమోటోగా కేసులు పెడుతాం
  •     పర్యవేక్షణకు పలు శాఖలతో కోఆర్డినేషన్​
  •     కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో అనుమతి లేకుండా ఇసుక, మొరం, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్​లో రెవెన్యూ, పోలీస్​, ఇరిగేషన్​, ఆర్​డబ్ల్యూఎస్​, మైనింగ్​, గ్రౌండ్​వాటర్, హౌసింగ్​, మినరల్​డవలప్​మెంట్​కార్పొరేషన్​అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ   సుమోటోగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

బాధ్యతనంతా గనుల శాఖపై వదిలేయరాదని, పోలీస్, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీలు సమన్వయంతో పని చేయాలన్నారు. గవర్నమెంట్ ఆదాయం పెరుగుదలతో పాటు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఇక ఇసుక వాహనాలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ యాప్ ద్వారా మాత్రమే బుక్​ చేసుకోవాలని, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ పర్మిషన్‌‌‌‌‌‌‌‌కు అవకాశం లేదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం కూలీలతో తవ్వకాలు జరుపడానికి మంజీరా తీరంలో ఐదు రీచ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసినట్లు  చెప్పారు. 

పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలు జరగకూడదని, వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సాగు భూముల్లో ఏర్పడిన ఇసుక మేటలను తొలగించడానికి కూలీలను మాత్రమే ఉపయోగించాలన్నారు. ట్రాక్టర్లు మాత్రమే వాడాలని, టిప్పర్లు, లారీలను అనుమతించకూడదని పేర్కొన్నారు. తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ చర్యలు అమలు చేయాలని సూచించారు. 

ఇసుకతో పాటు అనుమతిలేకుండా మొరం, మట్టి వ్యాపారాన్ని  ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. సహజ వనరులను కొల్లగొట్టే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకూడదని, ప్రతి శాఖ బాధ్యతగా పని చేయాలని హితవు పలికారు. అడిషనల్​కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, మైనింగ్ ఏడీ సంజయ్ కుమార్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, హౌసింగ్, మినరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.