- సూపర్-8లో టీమిండియా కీలక విజయం..72 రన్స్ తేడాతో జింబాబ్వేపై విక్టరీ
- దంచికొట్టిన అభి, హార్దిక్, తిలక్..ఆదివారం విండీస్‌పై గెలిస్తే సెమీస్‌కు..
చెన్నై: సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్లు శివాలెత్తారు. అభిషేక్ శర్మ (30 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55), హార్దిక్ పాండ్యా (23 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్), తిలక్ వర్మ (16 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) దంచికొట్టారు. ఫలితంగా గురువారం జరిగిన సూపర్–8 మ్యాచ్‌లో టీమిండియా 72 రన్స్ తేడాతో జింబాబ్వేపై గెలిచి సెమీస్ రేసులో నిలిచింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 256/4 స్కోరు చేసింది. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 184/6 స్కోరుకే పరిమితమైంది. బ్రియాన్ బెనెట్ (59 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్) చివరి వరకు పోరాడినా ప్రయోజనం దక్కలేదు. హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మరోవైపు వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలవడంతో టీమిండియా సెమీఫైనల్ లైన్ క్లియర్ అయింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో విండీస్‌పై గెలిస్తే సూర్యసేన సెమీస్‌లో అడుగు పెడుతుంది.
‘టాప్’ లేపారు..
తుది జట్టులో మార్పులు ఇండియాకు కలిసొచ్చాయి. ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ (24) టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఎంగరావ (1/62) వేసిన తొలి ఓవర్‌లోనే 6, 4తో టచ్‌లోకి వచ్చాడు. రెండో ఓవర్‌లో ముజరబానీ (1/43)కి సిక్స్‌తో స్వాగతం పలికాడు. అప్పటి వరకు డీలాగా కనిపించిన అభిషేక్ మూడో ఓవర్‌లో 4, 4, 6.. శాంసన్ 4తో రెచ్చిపోవడంతో 23 రన్స్ వచ్చాయి. కానీ నాలుగో ఓవర్‌లో ముజరబానీ వేసిన స్లో షార్ట్ బాల్‌ను భారీ షాట్ కొట్టిన శాంసన్ డీప్ మిడ్ వికెట్‌లో బర్ల్ చేతికి చిక్కాడు. తొలి వికెట్‌కు 48 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇషాన్ కిషన్ (38) డబుల్స్, సింగిల్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయగా, అభిషేక్ 6, 4 దంచాడు. ఆరో ఓవర్‌లో ఇషాన్ 4, 4, అభిషేక్ 6తో 17 రన్స్ వచ్చాయి. దాంతో ఇండియా పవర్‌ప్లేను 80/1తో ముగించింది. ఫీల్డింగ్ విస్తరించడంతో తర్వాతి రెండు ఓవర్లలో 10 రన్స్ వచ్చాయి. 9వ ఓవర్‌లో ఓ ఫోర్ కొట్టిన ఇషాన్ 10వ ఓవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ను డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో బెనెట్ మిస్ చేశాడు. ఇదే ఓవర్‌లో అభిషేక్ సిక్స్ దంచడంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా 109/1 స్కోరు చేసింది. 11వ ఓవర్‌లో సింగిల్‌తో అభిషేక్ 26 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ మూడో బాల్‌ను సిక్స్‌గా మలిచిన ఇషాన్ తర్వాతి బాల్‌కు ఔటవడంతో రెండో వికెట్‌కు 72 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఫోర్‌తో ఖాతా తెరిచిన సూర్యకుమార్ (33).. 12వ ఓవర్‌లో ఎవాన్స్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ముజరబానీ వదిలేశాడు. దీని నుంచి తేరుకున్న సూర్య తర్వాతి ఓవర్‌లో 4, 6తో ఒత్తిడి తగ్గించుకున్నాడు. కానీ అభిషేక్ ఫోర్ కొట్టి వెనుదిరిగాడు. హార్దిక్ వచ్చీ రావడంతోనే సిక్స్ కొట్టడంతో 14వ ఓవర్‌లో 10 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో సిక్స్‌తో జోరు పెంచిన సూర్య ఐదో బాల్‌కు ముసెకివా చేతికి చిక్కాడు. తిలక్ వర్మ ఫోర్‌తో 15 ఓవర్లలో స్కోరు 176/4కు చేరింది. తర్వాతి ఓవర్‌లో తిలక్ ఫోర్‌తో 11 రన్స్ రాగా, 17వ ఓవర్‌లో ఎవాన్స్ 4, 6తో 14 రన్స్ ఇచ్చాడు. 18వ ఓవర్‌లో హార్దిక్ 4.. తిలక్ 4, 6తో 19 రన్స్ రాబట్టారు. 19వ ఓవర్‌లో హార్దిక్ 4, తిలక్ 6, 6తో 21 రన్స్ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ రెండు సిక్స్‌లతో 23 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తిలక్, హార్దిక్ ఐదో వికెట్‌కు 84 రన్స్ జోడించి భారీ టార్గెట్‌ను నిర్దేశించారు.
అర్ష్‌దీప్ అదుర్స్..
ఛేజింగ్‌లో జింబాబ్వేను ఇండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. స్టార్టింగ్‌లో తడివానాషే మరుమని (20) సిక్స్, బెనెట్ ఫోర్‌తో కుదురుకున్నట్లు కనిపించారు. ఐదో ఓవర్‌లో బెనెట్ రెండు ఫోర్లతో జోరు పెంచాడు. ఆరో ఓవర్‌లో మరుమని సిక్స్‌తో పవర్‌ప్లేలో జింబాబ్వే 44/0 స్కోరు చేసింది. కానీ ఏడో ఓవర్‌లో అక్షర్ పటేల్ (1/35).. మరుమామని ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 44 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 9వ ఓవర్‌లో బెనెట్ 6, 4, 6తో రెచ్చిపోయాడు. 10వ ఓవర్‌లో డియోన్ మైయర్స్ (6)ను వరుణ్ పెవిలియన్‌కు పంపడంతో స్కోరు 73/2గా మారింది. బెనెట్‌కు తోడైన సికందర్ రజా (31) మెరుగ్గా ఆడాడు. సిక్స్‌తో అతను టచ్‌లోకి రాగా.. బెనెట్ సిక్స్‌తో 34 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆపై మరింత జోరు పెంచిన బెనెట్ 15వ ఓవర్‌లో 6, 4, 4, 6తో 26 రన్స్ దంచాడు. దాంతో స్కోరు 131/2కు పెరిగింది. తర్వాతి ఓవర్‌లో రజా 6, 4తో 13 రన్స్ రాబట్టాడు. 17వ ఓవర్‌లో అర్ష్‌దీప్ (3/24) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. రెండు బాల్స్ తేడాలో రజా, ర్యాన్ బర్ల్ (0)ను ఔట్ చేశాడు. మూడో వికెట్‌కు 72 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన మున్యోంగా (11) బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు దంచినా అర్ష్‌దీప్‌కే వికెట్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో ముసెకివా (7) సిక్స్.. బెనెట్ 6, 4 దంచినా జింబాబ్వేకు ఓటమి తప్పలేదు.
ఓ వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లో ఇండియా బ్యాటర్లు ఆరుగురు 150 ప్లస్ స్ట్రయిక్ రేట్‌తో 20 ప్లస్ రన్స్ చేయడం ఇదే తొలిసారి.
1 టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు 2007 డర్బన్‌లో ఇంగ్లండ్‌పై 218/4 స్కోరును అధిగమించింది. ఓవరాల్‌గా ఇండియాది రెండో అత్యధిక స్కోరు (256/4). శ్రీలంక (260/6 కెన్యాపై) ముందుంది.
ఈ ఇన్నింగ్స్‌లో ఇండియా సిక్సర్లు. వరల్డ్ కప్ మ్యాచ్‌లో మన టీమ్‌కు అత్యధికం. 2024లో ఆస్ట్రేలియాపై కొట్టిన 15 సిక్సర్ల రికార్డును
బ్రేక్ చేసింది.
26 వరల్డ్ కప్‌లో ఒక ఓవర్లో అత్యధిక రన్స్ ఇచ్చిన ఇండియా బౌలర్‌గా శివమ్ దూబే.. యువరాజ్ (25)ను అధిగమించాడు.
ఈ టోర్నీలో ఇండియా ఇప్పటి వరకు కొట్టిన సిక్సర్లు. 2024లో కొట్టిన 61 సిక్సర్లను అధిగమించింది. వెస్టిండీస్ (66) టాప్‌లో ఉంది.
స్కోర్ బోర్డు
ఇండియా: సంజూ శాంసన్ (సి) బర్ల్ (బి) ముజరబానీ 24, అభిషేక్ శర్మ (సి) రజా (బి) మాపోసా 55, ఇషాన్ కిషన్ (సి) ఎంగరావ (బి) రజా 38, సూర్యకుమార్ (సి) ముసేకివా (బి) ఎంగరావ 33, హార్దిక్ (నాటౌట్) 50, తిలక్ వర్మ (నాటౌట్) 44, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 256/4. వికెట్లపతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్: ఎంగరావ 4–0–62–1, ముజరబానీ 4–0–43–1, మాపోసా 2–0–40–1, ఎవాన్స్ 4–0–52–0, సికిందర్ రజా 3–0–29–1, బెనెట్ 2–0–16–0, బర్ల్ 1–0–10–0.
జింబాబ్వే: బెనెట్(నాటౌట్)97, మరుమని (సి) ఇషాన్ (బి) అక్షర్ 20, డియోన్ మైయర్స్ (సి) తిలక్ (బి) చక్రవర్తి 6, సికందర్ రజా (సి) అభిషేక్ (బి) అర్ష్‌దీప్ 31, బర్ల్ (ఎల్బీ) అర్ష్‌దీప్ 0, మున్యోంగా (బి) అర్ష్‌దీప్ 11, ముసెకివా (సి) శాంసన్ (బి) దూబే 7, ఇవాన్స్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 184/6. వికెట్లపతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–24–3, హార్దిక్ 3–0–21–0, బుమ్రా 3–0–21–0, చక్రవర్తి 4–0–35–1, అక్షర్ 4–0–35–1, దూబే 2–0–46–1.
