- ఇప్పటి వరకు వసూలైంది కేవలం 12.66 కోట్లు
- ఫైనాన్షియల్ ముగింపునకు మరో నెల రోజులే గడువు
- ట్యాక్స్ చెల్లించకపోతే నోటీసులు, ఇండ్లకు తాళాలు వేస్తామని హెచ్చరిక
యాదాద్రి, వెలుగు : మరో నెల రోజుల్లో 2025-–26 ఫైనాన్స్ ఇయర్ ముగియనుండగా.. మున్సిపాలిటీల్లో ట్సాక్స్ వసూలు చేయడంలో స్టాఫ్ విఫలమవుతున్నారు. చివరి ప్రయత్నంగా సాధ్యమైనంత ఎక్కువగా వసూలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్లు డైరెక్ట్‌గా పన్ను చెల్లించాలని ఫోన్ చేసి కోరుతున్నారు. చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తామని, అవసరమైన పక్షంలో ఇండ్లకు తాళాలు వేస్తామని హెచ్చరిస్తున్నారు.
టార్గెట్ రూ. 28.45 కోట్లు
యాదాద్రి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లో పన్ను చెల్లించే ఇండ్లు 38,321 ఉన్నాయి. 3727 కమర్షియల్ నిర్మాణాలు ఉన్నాయి. కమర్షియల్, ఇండ్లు కలిపి2408 ఉన్నాయి. 2024-–25 ఫైనాన్స్ ఇయర్‌లోనూ పెద్ద మొత్తమే పెండింగ్‌లో ఉంది. డిమాండ్‌తో పాటు దానిపై వేసిన ఫెనాల్టీ కలిపి ఆరు మున్సిపాలిటీల్లో రూ. 9.60 కోట్లు పెండింగ్‌లో ఉంది. 2025–-26 ఫైనాన్స్ ఇయర్లో డిమాండ్ ఫెనాల్టీ కలుపుకొని రూ. 18.35 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. మొత్తంగా రూ. 28.45 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
వసూలు 44.5 శాతమే
వసూలు చేయాల్సిన లక్ష్యం కండ్ల ముందే కన్పిస్తున్నా చాలా తక్కువగా వసూలు జరిగింది. పన్ను చెల్లింపులో ఓనర్ల నిర్లక్ష్యం కొంత ఉంటే.. కలెక్షన్ చేసే వారి నిర్లక్ష్యమూ కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. భువనగిరి మున్సిపాలిటీలో 39.69 శాతమే కలెక్షన్ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఒక్కటే కాస్తా మెరుగ్గా 58.99 శాతం కలెక్షన్ చేయగలిగింది. ఆలేరులో మరింత వీక్‌గా కేవలం 29.66 శాతమే కలెక్షన్ చేయగలిగారు. మొత్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 28.45 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ. 12.66 (44.5 శాతం) కోట్లు వసూలు చేయగలిగారు.
అవసరమైతే ఇండ్లకు తాళాలు
2025-–26 ఫైనాన్స్ ఇయర్ ముగింపునకు ఇంకా 30 రోజులే గడువుంది. అప్పటివరకూ కనీసం 90 శాతం వసూలు చేయాలన్న లక్ష్యంగా మున్సిపాలిటీలు ముందుకు సాగుతున్నాయి. వసూలు కోసం వార్డు ఆఫీసర్లు, లైన్ మెన్లను రంగంలోకి దించారు. పన్ను బకాయిల్లో ఎక్కువ మొత్తం పెండింగ్ ఉన్న వారిని గుర్తించి వారికి నేరుగా మున్సిపల్ కమిషనర్లే ఫోన్లు చేస్తున్నారు. స్పందించని వారికి ముందుగా రెడ్ నోటీసులు జారీ చేస్తామని చెబుతున్నారు.
ఆ తర్వాత నల్లా కనెక్షన్ కట్ చేస్తామని, అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి ఇండ్లకు అవసరమైతే తాళాలు వేస్తామని చెబుతున్నారు. టాక్స్ వసూలు బట్టి మున్సిపాలిటీలకు 16వ ఆర్థిక సంఘం ఫండ్స్ వస్తాయని ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాదిలో 60 శాతం ట్యాక్స్ కలెక్షన్ చేశారు. ఈ సారి అంతకంటే 12 శాతం ఎక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే ఫండ్స్ వస్తాయని చెబుతున్నారు.
రెడ్ నోటీసులు జారీ చేస్తం:
పన్ను ఎక్కువ పెండింగ్ ఉన్న వారి నుంచి ముందుగా వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారితో డైరెక్ట్‌గా ఫోన్లో మాట్లాడుతున్నాం. స్పందించని వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తాం. అప్పటికీ స్పందించకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటాం. - వెంకట్రామ్ రెడ్డి, కమిషనర్, చౌటుప్పల్ మున్సిపాలిటీ
యాదాద్రి జిల్లాలోని మున్సిపాలిటీల్లో టాక్స్ వసులూ వివరాలు రూ.కోట్లు
మున్సిపాలిటీ 2024-25 2025-26 మొత్తం వసూలు పెండింగ్
పెండింగ్ టాక్స్
భువనగిరి రూ.3.77 రూ.5.97 రూ. 9.74 రూ. 3.86 రూ.5.88
ఆలేరు రూ.0.89 రూ.1.61 రూ. 2.50 రూ. 0.74 రూ. 1.76
చౌటుప్పల్ రూ.2.34 రూ.5.80 రూ. 8.14 రూ. 4.80 రూ.3.34
మోత్కూరు రూ.0.32 రూ.1.04 రూ.1.36 రూ. 0.60 రూ.0.76
గుట్ట రూ.1.24 రూ.2.52 రూ. 3.76 రూ. 1.65 రూ. 2.11
పోచంపల్లి రూ.1.04 రూ.1.91 రూ. 2.95 రూ. 1.01 రూ. 1.94
మొత్తం రూ.9.60 రూ.18.85 రూ. 28.45 రూ. 12.66 రూ. 15.79
