- ఇండ్లు, అపార్ట్మెంట్లపై హోర్డింగులకు నో
- ఏడు కేటగిరీల్లో అడ్వర్టైజ్మెంట్లు
- సర్కారు భవనాలు, ప్రభుత్వ స్థలాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు
- వచ్చే నెలలో అందుబాటులోకి
- కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు : కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంబంధిత శాఖలు సమగ్ర మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. మరో నెల రోజుల్లో ఇది అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. అక్రమాలకు చెక్‌పెట్టడం, మూడు కార్పొరేషన్లకు ఆదాయం తీసుకురావడం, ఇంతకుముందు హోర్డింగుల వల్ల జరిగిన ప్రమాదాలు రిపీట్‌కాకుండా జాగ్రత్తగా కొత్త పాలసీని తీసుకువస్తున్నట్టు తెలిసింది.
ఏడు కేటగిరీల్లో అడ్వర్టైజ్మెంట్లకు ప్రకటనలు ఇచ్చేలా, 2020లో నిలిచిపోయిన యూనిపోల్స్, హోర్డింగ్స్ కు తిరిగి పర్మిషన్ ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ఉండేలా చూస్తున్నారు.
కొత్త పాలసీతో వీటికి చెక్..
జీహెచ్ఎంసీ పరిధిలో భారీ యూనిపోల్స్, హోర్డింగ్స్ కు అనుమతి లేకపోవడంతో 2020 నుంచి పాత 27 మున్సిపాలిటీల్లో ఏజెన్సీలు భారీగా యూనిపోల్స్, హోర్డింగ్స్ పెట్టుకుని సంపాదించుకున్నాయి. 2022 నుంచి శివార్లలో కూడా భారీ హోర్డింగ్స్, యూనిపోల్స్ కు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏజెన్సీలు..శంషాబాద్, కొంపల్లి, ఘట్కేసర్, నార్సింగి, మణికొండ, బడంగ్ పేట్, మేడ్చల్, దుండిగల్ తో పాటు పలు చోట్ల అక్రమంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఇలా నాలుగేండ్ల పాటు అధికారులను మ్యానేజ్ చేస్తూ ప్రభుత్వానికి రూపాయి కూడా కట్టకుండా కోట్లు ఆర్జించారు. విలీనం తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ కొత్త పాలసీ తీసుకురావడానికి డిసైడ్అయ్యింది.
అందుకే కొత్త పాలసీ..
ఇకపై నగరంలోని అన్ని ప్రాంతాల్లో కాకుండా కమర్షియల్ హబ్ లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి మాత్రమే అడ్వర్టైజ్‌మెంట్ లకు అనుమతి ఇచ్చేలా పాలసీ రానున్నట్లు సమాచారం. ప్రతీ కిలోమీటర్ కు నాలుగు యూనిపోల్స్ కు పర్మిషన్ ఇచ్చేలా పాలసీ ఉండనుందని, కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో ఏర్పాటు చేసే హోర్డింగ్స్, యూనిపోల్స్ ను ఆక్షన్ విధానం ద్వారా ఏజెన్సీలకు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రైవేట్ స్థలాల్లో అడ్వర్టైజ్‌మెంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకుంటే టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయింపులు ఇవనున్నట్లు, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాల వారీగా, అలాగే అడ్వర్టైజ్‌మెంట్ సైజ్ ఆధారంగా చదరపు అడుగుకు రేట్లు నిర్ణయించేలా పాలసీ రానున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్(పీపీపీ) లో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టులకు అడ్వర్టైజ్మెంట్ పాలసీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసిన సంస్థకు డిజిటల్ స్క్రీన్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే అవకాశం కల్పించనుంది.
10 శాతం ప్రభుత్వ పథకాల ప్రచారానికి ..
అడ్వర్టైజ్‌మెంట్ స్థలాల్లో 10 శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి కేటాయించనున్నారు. ఇప్పటి వరకు ఏడాదికోసారి కేటాయింపులు జరిపే విధానం ఉండగా, కొత్త పాలసీ ప్రకారం హోర్డింగ్స్, యూనిపోల్స్‌ను ఒకేసారి ఐదేండ్లకు టెండర్ల ద్వారా కేటాయించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది ఛార్జీలను ముందుగానే జీహెచ్ఎంసీ ఖాతాలో జమ
చేయాల్సి ఉంటుంది.
ఆ ప్రాంతాల్లోనే లీడర్ల ఫ్లెక్సీలు
నగరంలో రాజకీయ, ఇతర సమావేశాలు, నాయకుల పుట్టిన రోజున రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ ఫ్లోటింగ్ యాడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి ఇలా కాకుండా మీటింగ్స్ జరిగే ప్రాంతాల్లో, బర్త్‌డే వేడుకలు జరుపుకునే చోట అడ్వర్టైజ్మెంట్స్కోసం స్పెషల్ ప్లేస్ లు కేటాయించనున్నారు. ఇండ్లపై ఏర్పాటు చేసే హోర్డింగుల వల్ల గాలి దుమారం వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వాటికి అనుమతి ఇవ్వకూడదనే అనుకుంటున్నట్టు సమాచారం.
