- మార్కెట్ ఆఫీస్ ఎదుట ధర్నా, అద్దాలు ధ్వంసం
- ఓపెన్ యాక్షన్‌తో అమ్మకాలు పూర్తి చేసిన ఆఫీసర్లు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ గంజ్ మార్కెట్‌లో పసుపు రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ–నామ్ సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడంతో మార్కెట్‌లో మూడు రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్‌లో 35 వేల బస్తాల పసుపు స్టాక్ పేరుకుపోవడం, అకాల వర్షాలు పడుతుండడంతో ఆందోళనకు గురైన రైతులు గురువారం కమిటీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు.
కొనుగోళ్లు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆఫీస్ డోర్ అద్దాలు పగులగొట్టి సెక్రటరీ అపర్ణతో వాగ్వాదానికి దిగారు. ఆమె చైర్మన్ ముప్ప గంగారెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన మార్కెట్‌కు వచ్చి.. రైతులు, పసుపు ట్రేడర్స్, ఏజెంట్లతో మీటింగ్ నిర్వహించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్‌కు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఓపెన్ యాక్షన్ ద్వారా కొనుగోళ్లు
ఈ–నామ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడంతో పసుపు కొనుగోళ్లు నిలిచిన విషయాన్ని మార్కెట్ సెక్రటరీ అపర్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడంతో ఓపెన్ యాక్షన్ నిర్వహించేందుకు ఒప్పుకున్నారు. దీంతో లోకల్ ట్రేడర్లను పిలిచి మార్కెట్‌లో ఉన్న 30 వేల బస్తాల స్టాక్‌ను అమ్మేశారు. మిగిలిన స్టాక్‌ను సైతం ఓపెన్ యాక్షన్ విధానంలోనే సేల్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
