- డీఫాల్టర్ల నుంచి 100 శాతం రికవరీకి మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
- కానీ జిల్లాల్లో అక్రమార్కులకే సహకరిస్తున్న సివిల్ సప్లైస్ అధికారులు
- మొక్కుబడి నోటీసులు.. ఆస్తులు అమ్ముకున్నాక ఆర్ఆర్ యాక్ట్‌లు
- కొన్నిచోట్ల తమకు ఆర్ఆర్ ఆదేశాలే రాలేదంటున్న తహసీల్దార్లు
- ఇప్పటికే బినామీ కంపెనీల్లోకి మళ్లిన డీఫాల్టర్ల పెట్టుబడులు
కరీంనగర్/నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో వేల కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించి, డీఫాల్టర్లుగా తేలిన మిల్లర్ల నుంచి సొత్తు రికవరీ చేయడంలో కొందరు సివిల్ సప్లై ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డీఫాల్టర్ల నుంచి 100 శాతం రికవరీ చేయాల్సిందేనని ఓవైపు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఆదేశిస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు మిల్లర్లకే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి సీరియస్ కాగానే డీఫాల్టర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు హడావుడి చేయడం, నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత మిల్లర్లతో మిలాఖతై వదిలేయడం పరిపాటిగా మారింది. ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి, వారికి డిమాండ్ నోటీసులు పంపాక నెల రోజుల్లో స్పందించకుంటే డీఫాల్టర్ల ఆస్తులను జప్తు చేయాల్సిన ఆఫీసర్లు నెలలు, ఏండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు. డీఫాల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని, ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తున్నామని బయటికి ప్రకటిస్తూ గేమ్ ఆడుతున్నారని, లోలోపల మిల్లర్లతో లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
డీఫాల్టర్ల ఆస్తులు జప్తు చేయడంలో జాప్యం చేస్తున్నారని, ఈ లోపు డీఫాల్టర్లు తమ ఆస్తులు వేరొకరికి అమ్ముకోవడమో, బినామీలకు పేరిట బదాలయించడమో చేస్తున్నారని, ఆ తర్వాత ఆర్ఆర్ యాక్ట్ లు, మొక్కుబడి నోటీసులతో ప్రయోజనమేమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
25 శాతం కూడా వసూలు చేయలే..
బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ సేకరణపై తీవ్ర నిర్లక్ష్యం వల్ల వేల కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. 2014 నుంచి తొమ్మిదేళ్లలో మిల్లర్ల వద్ద దాదాపు
రూ.11వేల కోట్లకు పైగా పెండింగ్పడగా, గత2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి మరో 4వేల కోట్లకు పైగా పెండింగ్‌పడ్డాయి. మిల్లర్ల నుంచి దాదాపు రూ.15వేల కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఇందులో 25శాతం కూడా రికవరీ కాలేదు.
డీఫాల్టర్ల పేరిట ఆస్తుల్లేవు..
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎస్వీ ఇండస్ట్రీస్ యజమాని సంకీస నాగరాజు 2014–15 ఖరీఫ్ లో 3317.42 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించారు. ఇందుకు సంబంధించి ఆయన రూ.61,59,439 చెల్లించాల్సి ఉంది. పదేళ్లు కావడంతో వడ్డీ, జరిమానాతో కలిపితే కోటిన్నర దాటే అవకాశముంది. పదేండ్ల తర్వాత అధికారులు సదరు మిల్లుపై ఎంక్వయిరీ చేశారు. ఇప్పటికే నాగరాజు మృతిచెందగా ఆ మిల్లును కూడా లోన్ బకాయి కింద బ్యాంకువాళ్లు వేలం వేసినట్లు గుర్తించారు. అలాగే ఇదే మండలంలోని కోరపల్లిలోని మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీలో సైతం 2022–23 రబీ, 2023–24 ఖరీఫ్ సీజన్ లో 1,23,773 మెట్రిక్ టన్నుల ధాన్యం దారి మళ్లింది. ఆ సమయంలో లీజుదారు మారుతి ఈ తతంగం నడిపారు. మిల్లును ఓనర్ వేరొకరికి అమ్మేశాడు. డీఫాల్టర్ల పేరిట గుంట భూమి కూడా లేదు, అక్కడ రివకరీ చేయడానికి ఏమి లేదని, ఉన్నతాధికారులకు రిపోర్టు ఇవ్వనున్నట్టు జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ ఉదాహరణలు..
- కరీంనగర్ జిల్లాలో 11 రైస్ మిల్లుల నుంచి రూ.121 కోట్ల మేర సీఎంఆర్ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. ఆ మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ ఇంపోజ్ కేసు తహసీల్దార్ల వద్ద పెండింగ్ లో ఉందని కరీంనగర్ జిల్లా సివిల్ సప్లై డీఎం రజనీకాంత్ రెండు నెలల క్రితం ఇచ్చిన రిపోర్టులో ఉంది. కానీ ఇదే విషయమై శంకరపట్నం, మానకొండూరు తహసీల్దార్లను ఎంక్వైరీ చేస్తే అసలు ఆర్ఆర్ యాక్ట్ కు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, తాము రైస్ మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. జమ్మికుంట, హుజురాబాద్ తహసీల్దార్లు మాత్రం డీఫాల్టర్లకు నోటీసులు ప్రిపేర్ చేస్తున్నట్లు చెప్పారు.
- పెద్దపల్లి జిల్లాలో 2014-–15 నుంచి 2023–24 వరకు రూ.354 కోట్ల విలువైన సీఎంఆర్ రైస్ 78 మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇందులో రూ.100 కోట్ల విలువైన రైస్ రికవరీ చేశారు. ఇంకా రూ.250 కోట్ల వరకు రికవరీ చేయాల్సి ఉంది. డీఫాల్టర్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు అంటుండగా, డీఫాల్టర్ల నుంచి ఆర్ఆర్ యాక్ట్ ద్వారా సొత్తు రికవరీకి తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తహసీల్దార్లు చెప్తున్నారు.
- సిద్దిపేట జిల్లా లో వడ్లు మాయం చేసిన ఘటనల్లో రాయపోలు మండలం వడ్డేపల్లి గ్రామంలోని శ్రీసాయి వీరభద్ర రైస్ ఇండస్ట్రీస్, కొమురవెల్లి మండలం కిష్టంపేటలోని శ్రీనివాస రైస్ మిల్, రాయపోలు మండలం వడ్డేపల్లి గ్రామంలోని వీరభద్ర రైస్ మిల్, వర్గల్ మండలం నాచారంలోని శ్రీసాయిబాబా బిన్ని మోడ్రన్ రైస్ మిల్ పై కేసులు నమోదు చేశారు. ఇంకా రికవరీకి చర్యలు ప్రారంభించలేదని సివిల్ సప్లై ఆఫీసర్లు తెలిపారు.
- నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ ఇవ్వకుండా ధాన్యాన్ని దారిమళ్లించిన 30 మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. అలాగే మరో 15 మిల్లులను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. 2023–24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 5వేల మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్ లో ఉంది. 2023 -24 రబీ సీజన్ కు సంబంధించి 44,752 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఈ రెండు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ రికవరీ కోసం ఈనెల 12వ తేదీ చివరి గడువు విధించినా మిల్లర్లు బేఖాతరు చేశారు.
- భూపాలపల్లి జిల్లాలో 2022–23 లో కాటారం మండలం దామరకుంట త్రీఆర్స్ రైస్ మిల్, మొగుళ్లపల్లి మండలంలో సువర్ణ లక్ష్మి, రేగొండ మండలం బాగిర్తిపేటలో దుర్గ భవాని మిల్లుల నుంచి 12.76 కోట్లు రికవరీ కావాల్సి ఉంది. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఈ మూడు మిల్లులను సీజ్ చేశారు. అలాగే గణపురం మండలం కోడంపేటలోని వెంకటేశ్వర రైస్ మిల్, చెల్పూర్ లోని హరిహర రైస్ మిల్, కాటారం మండలంలోని అన్నపూర్ణ రైస్ మిల్, భూపాలపల్లి మండలంలోని గొర్లవీడులోని వెంకటేశ్వర ఆగ్రో రైస్ మిల్‌తో సహా 17 మిల్లుల నుంచి రూ.7 కోట్లు రివకరీ కావాల్సి ఉంది.
- మంచిర్యాల జిల్లాలో 2019–20 రబీ సీజన్ నుంచి 2023–24 రబీ సీజన్ వరకు మొత్తం 55,667.971 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. ఫైన్లతో కలిపి వీటి విలువ రూ.218.19 కోట్లు. సివిల్ సప్లై అధికారులు 19 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు, 23 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కేసులు నమోదు చేశారు. దీంతో పలువురు మిల్లర్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. రెవెన్యూ అధికారులు మిల్లర్ల ఆస్తులను గుర్తించినప్పటికీ అటాచ్మెంట్ చేయలేదు. సివిల్ సప్లై అధికారులు కేవలం కేసులు బుక్ చేయడంతో రికవరీకి రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
నోటీసులు ఇచ్చి ఏడాది దాటినా చర్యల్లేవ్
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీసీతారామ అగ్రో ఇండస్ట్రీస్ ద్వారా బండారి శారద, మారుతి దంపతులు 2022–23 రబీ, 2023-–24 ఖరీఫ్ సీజన్లలో రూ.54.96 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్టులో ఆర్ఆర్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదైంది. జరిమానాతో కలిపి రూ.68.75 కోట్లు చెల్లించాలంటూ వారికి ఇల్లందకుంట తహసీల్దార్ అదే ఏడాది డిసెంబర్ నవంబర్ 12న డిమాండ్ నోటీసులు పంపారు. చట్ట ప్రకారం 30 రోజుల్లోపు సొత్తు రికవరీ కాకుంటే ఆస్తుల జప్తు, వేలం, ఎగవేతదారుల అరెస్టులాంటి చర్యలు తీసుకోవాలి. కానీ 15 నెలలు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆఫీసర్ల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇదే బండారి మారుతి జమ్మికుంట మండలం కోరపల్లి మహాశక్తి అగ్రో ఇండస్ట్రీస్ ద్వారా మరో రూ.50 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించారు. ఈ మిల్లుపైనా ఆర్ఆర్ యాక్ట్ నమోదైంది. అయితే ఈ రెండు మిల్లులు డీఫాల్టర్లు లీజుకు తీసుకున్నవి కావడం, లీజు గడువు ముగియడంతో ఓనర్లు ఇతరులకు అమ్మేయడంతో ఆ సొత్తు రికవరీ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మాకు సమాచారమే లేదు: తహసీల్దార్లు
శంకరపట్నం మండలం మొలంగూరులోని పవనసుత ట్రేడర్స్ కేరాఫ్ లలిత ఇండస్ట్రీస్ 2021–22 ఖరీఫ్ కు సంబంధించి రూ.5.48 కోట్లు, ఇదే మండలం రాజాపూర్ లోని శ్రీలక్ష్మి మోడ్రన్ రైస్ మిల్లు 2021–23 ఖరీఫ్ కు సంబంధించి రూ.70 లక్షల ధాన్యాన్ని దారి మళ్లించాయి. ఈ రెండు మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ నమోదు చేసినట్లు, ఈ కేసు తహసీల్దార్ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు జిల్లా సివిల్ సప్లయ్స్ డీఎం రజనీకాంత్ వెల్లడించారు. కానీ ఇదే విషయమై సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆర్టీఐ కింద సమాచారం అడగగా.. అసలు రెండు రైస్ మిల్లులకు సంబంధించి ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులు, కేసులు పెండింగ్ లేవని, తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు
ఆఫీసర్ల అండతోనే మిల్లర్ల అక్రమాలు..
సివిల్ సప్లై ఆఫీసర్ల అండతోనే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొందరు మిల్లర్లు రూ.కోట్లు కొల్లగొట్టారు. సర్కార్ అప్పగించిన ధాన్యం మిల్లుల్లో ఉందో, లేదో చూడాల్సిన ఆఫీసర్లు పట్టించుకోలేదు. అక్రమార్కులతో అంటకాగుతున్న ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. సొత్తు రివకరీ చేయాలి.
- పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్
