రైతన్న భవితకు ‘సోలార్’ చేయూత!.. పీఎం కుసుమ్ స్కీమ్‌‌‌‌తో వ్యాపారులుగా మారుతున్న కర్షకులు

రైతన్న భవితకు ‘సోలార్’ చేయూత!.. పీఎం కుసుమ్ స్కీమ్‌‌‌‌తో వ్యాపారులుగా మారుతున్న కర్షకులు
  •     సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటుతో ఏటా రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల ఆదాయం
  •     ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైన పనులు 
  •     రాష్ట్రంలో 1,450 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్​
  •     ఉత్పత్తి చేసిన విద్యుత్‌‌‌‌ను 25 ఏండ్ల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం
  •     ఇప్పటికే 940 మంది రైతుల అప్లికేషన్లు ఆమోదం  
  •     ప్లాంట్ల ఏర్పాటుకు 85 శాతం మేర బ్యాంకు రుణాలు

హైదరాబాద్, వెలుగు: పంటలు పండించే రైతన్నలు.. ఇకపై పవర్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేయనున్నారు. కేవలం మూడెకరాల భూమి ఉంటే చాలు.. ఏటా రూ.10 లక్షలకు పైగా ఆదాయం సంపాదించుకోవచ్చు.. పదేండ్ల తర్వాత ఈ మొత్తం రూ.40 లక్షలకు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం కుసుమ్‌‌‌‌’ పథకంతో ఇది సాధ్యం కానుంది. 

రైతులు తమ భూముల్లో సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయిన కరెంట్‌‌‌‌ను అమ్ముకొని లక్షలు సంపాదించుకోవచ్చు. రైతులు ఇప్పుడు పెట్టుబడి పెడ్తే రాబోయే పాతికేండ్ల దాకా రందీలేని వ్యాపారం చేసుకోవచ్చు. ఉత్పత్తి చేసిస కరెంట్‌‌‌‌ను ఒప్పందం ప్రకారం ప్రభుత్వమే 25 ఏండ్ల దాకా కొనబోతోంది. ఈ వ్యాపారానికి పెట్టుబడి ఎట్లా? అనే రంది కూడా రైతన్నలకు అక్కర్లేదు. 

బ్యాంకులే 85 శాతం వరకు లోన్లు అందిస్తున్నాయి. రైతులు 15 శాతం నిధులు జమ చేస్తే పదేండ్లలో ఈఎంఐ పద్ధతిలో అప్పు తీర్చవచ్చని భరోసా ఇస్తున్నాయి. ‘పీఎం కుసుమ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,450 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 940 మంది రైతుల అప్లికేషన్లకు ఆమోదం తెలిపింది. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో పనులు కూడా మొదలయ్యాయి. ఉగాది తర్వాత రాష్ట్రంలో సోలార్ పవర్ పెద్ద మొత్తంలో ఉత్పత్తి కాబోతోంది. 

పీఎం కుసుమ్​ ప్రాజెక్ట్ అంటే ఏంటి?

వ్యవసాయంలో సోలార్ ఎనర్జీ తయారీ, వినియోగం కోసం చేపట్టిన స్కీం ఇది. ఇందులో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ ఊర్దా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) ప్రాజెక్టు ప్రారంభించింది. వ్యవసాయంలో సౌరశక్తిని ప్రోత్సహించడం, సౌర పంపులు ఏర్పాటు చేయడం, వ్వయసాయ, బంజరు భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 

ఇక్కడ ఉత్పత్తయ్యే సోలార్ విద్యుత్‌‌‌‌ను డిస్కంలకు అమ్మి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని సంకల్పించింది. పీఎం కుసుమ్‌‌‌‌ పథకాన్ని గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలుకు కృషి చేస్తోంది. 

ఏడాదిలో 1,450 మెగావాట్లకు గ్రీన్ సిగ్నల్..​

ఈ పథకంలో భాగంగా ఒకే ఏడాదిలో 1,450 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్‌‌‌‌ కింద ఒక రైతు తనకున్న వ్యవసాయ భూమిలో 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులు 25 ఏండ్ల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సర్కారు డీపీఆర్ ప్రకారం రూ.3.2 కోట్ల వరకు ఖర్చవుతోంది. మూడెకరాల వ్యవసాయ భూమి ఉంటే సరిపోతుంది. 

ఇందులో పదేండ్ల గడువుతో 85 శాతం డబ్బులను బ్యాంకులు రుణాలుగా అందించడానికి ముందుకొచ్చాయి. మిగతా 15  శాతం నిధులను రైతు పెట్టుకోవాల్సి ఉంటుంది. అతని దగ్గర మొత్తం డబ్బులు లేకపోతే రైతు సంఘాలు పెట్టుకొని, వాటాల ప్రకారం డబ్బులు పెట్టుబడి పెట్టి, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. 2 మెగావాట్ల వరకు అయితే 6 నుంచి 7 ఎకరాల వ్యవసాయ భూమి అవసరం. 0.5 మెగావాట్ అయితే ఎకరన్నరం భూమి సరిపోతుందని రెడ్కో ఆఫీసర్లు తెలిపారు. 

రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల ఆదాయం..

ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3.2 కోట్లు ఖర్చు అవుతుండగా, బంజరు భూములు, ఇతర నాసీరకం భూములైతే మరో రూ.30 లక్షల వరకు ఖర్చు పెరుగుతోందని రెడ్కో ఆఫీసర్లు తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్‌‌‌‌కు 5 కిలోమీటర్లు పరిధిలో ఉన్న భూములను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. సబ్​స్టేషన్ నుంచి సోలార్ ప్లాంట్ వరకు ఒక కొత్త లైన్ వేసి డిస్కంకు అనుసంధానం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు చేసిన డిస్కంలు యూనిట్‌‌‌‌కు రూ.3.13 చొప్పున ఏడాదిలో రూ.52 లక్షలు రైతులకు చెల్లిస్తారు. 

బ్యాంకు అందించే 85 శాతం రుణం కింద నెలకు రూ.3 లక్షల చొప్పున ఏడాదికి రూ.36 లక్షలు వసూలు చేసుకుంటాయి. ప్లాంట్ నిర్వహణ ఖర్చులు రూ.6 లక్షలు అవుతాయి. మిగతా రూ.10 లక్షలు రైతులకు ఆదాయం వస్తోంది. ప్లాంట్ జీవిత కాలం 25 ఏండ్లు కాగా, పదేండ్లకు బ్యాంకు రుణం తీరిన తర్వాత ఖర్చులు పోను పెట్టుబడి లేకుండా రైతుకు ఏటా రూ.40 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఇలా మిగతా 15 ఏండ్లలో రూ.6 కోట్ల వరకు ఆదాయం సంపాదిస్తారని రెడ్కో ఆఫీసర్లు తెలిపారు. 

ఎకరన్నర భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు సైతం 0.5 మెగావాట్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నా.. ఏటా రూ.5 లక్షలు, పదేండ్ల తర్వాత ఏటా రూ.20 లక్షల చొప్పున ఆదాయం పొందవచ్చు. మరోవైపు, రైతుల వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వమే వ్యవసాయ భూమిని ఉచితంగా నాలా కన్వర్షన్ చేస్తుంది. స్టేట్ జీఎస్టీలో 50 శాతం నిధులను తిరిగి రైతులకు చెల్లిస్తోంది. బ్యాంకులు ఇచ్చే రుణానికి ఏటా 9 శాతం వడ్డీ వేస్తే, ఇందులో 3 శాతం వడ్డీ రాయితీని అందిస్తారు. 

ఫేక్​ కంపెనీలను నమ్మొద్దు!

సోలార్ పవర్​ ప్లాంట్ల ఏర్పాటులో రైతులు ఫేక్ కంపెనీలను నమ్మొద్దు. రాష్ట్రంలో 940 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో 1,450 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే పనులు స్టార్ట్ అయ్యాయి. రెడ్కో జిల్లా మేనేజర్లు ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే పనులు కంప్లీట్ చేసి అన్ని చోట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేస్తాం.- వి.అనిలా, వైస్ చైర్మన్ అండ్ ఎండీ, టీజీ రెడ్కో, హైదరాబాద్​

రాష్ట్రంలో 940 మంది రైతుల అప్లికేషన్లకు ఆమోదం..

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 940 మంది రైతుల అప్లికేషన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరంతా డిస్కంలతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు (పీపీఏ) చేసుకున్నారు. ఇప్పటికే రూ.5 వేల కోట్ల పెట్టుబడితో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 42 మంది రైతులు 63.4 మెగావాట్లు, కామారెడ్డి జిల్లాలో 22 మంది రైతులు 23.7 మెగావాట్లు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే పనులు మొదలుపెట్టారు. 

ఇప్పటికే కొందరు రైతుల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సంబంధించిన పైపులు కూడా ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో 13 మంది రైతులు 17.5 మెగావాట్లు, మహబూబాబాద్ జిల్లాలో 19 మంది రైతులు 26.01 మెగావాట్లు, ములుగు జిల్లాలో ఐదుగురు రైతులు 4.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్​ప్లాంట్ల పనులు స్టార్ట్ చేశారు.