సుల్తానాబాద్, వెలుగు: మహిళా కూలీలను తీసుకెళ్లే ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడడంతో ఒకరు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన మేరకు.. జూలపల్లి మండలం వర్కాపూర్ గ్రామానికి చెందిన మహిళా కూలీలు వరినాట్లు వేసేందుకు ఆదివారం మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి ఆటోలో బయలుదేరారు.
సుల్తానాబాద్ మండలం కోమండ్లపల్లి వైపు నుంచి వెళ్తుండగా కంకర లోడ్ ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. ఆటోలో ముందు కూర్చున్న గీకురు కవిత (36)కు తీవ్ర గాయాలై స్పాట్ లో చనిపోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతురాలి భర్త కనకరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
