చొప్పదండి, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చొప్పదండి పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యకర్తలకు సూచించారు. ఆదివారం మున్సిపాలిటీ ఎన్నికలపై చొప్పదండిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. అనంతరం చొప్పదండిలోని నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులను ఎమ్మెల్యే సన్మానించారు. అంతకుముందు 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరికలు
గంగాధర, వెలుగు: అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం రంగారావుపల్లి సర్పంచ్ దాసరి శంకరయ్య ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అంతకుముందు ఇస్లాంపూర్‌లో ఇస్లాంపూర్ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న జీపీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ బారాజు ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ సుంకే రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నగేశ్ పాల్గొన్నారు.
