అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని హెబర్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక వింత సంఘటనతో సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్ పోయిన నెలలో డ్రాఫ్ట్ వన్ అనే ఏఐ సాఫ్ట్‌వేర్‌ని నేర పరిశోధన కోసం వాడాలని నిర్ణయించుకుంది. దాంతో టెస్టింగ్ మొదలుపెట్టింది. ఈ సాఫ్ట్‌వేర్‌లు పోలీసులు బాడీకి తగిలించుకున్న కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ, ఆడియోని ఆధారంగా చేసుకుని ఆటోమేటిక్‌గా కేసుకి సంబంధించిన రిపోర్టుని రాస్తాయి.
అయితే.. ఏఐ రాసిన ఒక రిపోర్ట్‌లో ‘పోలీస్ ఆఫీసర్ కప్పగా మారిపోయాడ’ని ఉంది. అది బయటికి లీక్ కావడంతో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. “అధికారి ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సినిమా ప్లే అవుతోంది. ఏఐ ఆ సినిమాలోని డైలాగ్‌లను తీసుకుని, రిపోర్టులో కలిపేసింది. సినిమాలో ప్రిన్స్ కప్పగా మారే సన్నివేశం ఉంది. ఏఐ దాన్ని తీసుకుని పోలీస్ కప్పగా మారాడని రాసింది” అని వివరణ ఇచ్చారు అధికారులు.
