అహ్మదాబాద్: గ్లోబల్‌గా అనిశ్చితి పరిస్థితులు ఉన్నా, భారత్ మాత్రం బలంగా ఉందని, ప్రధాని మోదీ వల్ల జియోపొలిటికల్ సంక్షోభాల ప్రభావం ఇండియాపై పెద్దగా లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, రానున్న పదేళ్లలో ఇండియా దూసుకుపోతుందని తెలిపారు.
అంబానీ గుజరాత్‌లో తమ పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు పెంచుతామని, జామ్‌నగర్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ -రెడీ డేటా సెంటర్ నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, సస్టయినబుల్ ఫ్యూయల్స్ రంగాల్లో ప్రపంచ నాయకత్వం సాధించడమే లక్ష్యమని చెప్పారు. అదనంగా, 2036 ఒలింపిక్ గేమ్స్‌కు మద్దతుగా, రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్ ప్రభుత్వంతో కలిసి వీర్ సావర్కర్ మల్టీ-స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణలో పాలుపంచుకుంటుందని ప్రకటించారు.
అదానీ రూ.1.5 లక్షల కోట్లు..
అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతుందని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ప్రకటించారు. 2030 నాటికి ఖవ్డా ప్రాజెక్ట్ పూర్తి చేసి 37 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తామని, ముంద్రా పోర్ట్ సామర్థ్యాన్ని 10 ఏళ్లలో రెట్టింపు చేస్తామని తెలిపారు. కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అన్నారు.
