AI వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఏయే ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత ఉంటుంది? అసలు మార్పు ఎప్పుడు మొదలవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవటం నిపుణులకు కూడా పెద్ద సవాలుగానే మారింది. ఈ చిక్కుముడిని విప్పేందుకు ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' ఒక సరికొత్త మార్గాన్ని కనిపెట్టింది. నిరుద్యోగ గణాంకాలు బయటకు రాకముందే.. ఏ ఉద్యోగాలు ఏఐ ముప్పులో ఉన్నాయో ముందుగానే పసిగట్టేలా ఒక ప్రత్యేక ఎక్స్‌పోజర్ ఇండెక్స్ సిద్ధం చేసింది.
ఆంథ్రోపిక్ నిపుణులు మాక్సిమ్ మాసెన్‌కాఫ్, పీటర్ మెక్‌క్రోరీ రూపొందించిన ఈ వ్యవస్థ చాలా లోతుగా పనిచేస్తుంది. ఇది కేవలం ఉద్యోగాల పేర్లను మాత్రమే చూడదు.. ఆ ఉద్యోగాల్లో ఉండే ప్రతి చిన్న పనినీ విశ్లేషిస్తుంది. ఒక ఉద్యోగంలో చేసే పనులలో ఏఐ చేయగలిగేవి ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం ఆ పనులను ఏఐ టూల్స్ నిజంగానే చేస్తున్నాయా? అనే అంశాల ఆధారంగా ఆ ఉద్యోగానికి ఒక స్కోరు ఇస్తుంది. స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ ఉద్యోగం ఏఐ వల్ల అంత ప్రమాదంలో ఉన్నట్లు లెక్క.
ఈ రీసెర్చ్ లో తేలిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెక్ రంగంలోని ప్రోగ్రామర్లు ఏఐ వల్ల అత్యధిక ముప్పును కలిగి ఉన్నారంట. ఒక ప్రోగ్రామర్ చేసే పనుల్లో దాదాపు 75 శాతం పనులను ఏఐ టూల్స్ సమర్థవంతంగా చేయగలవని ఈ ఇండెక్స్ తేల్చేసింది. వీరితో పాటు కస్టమర్ కేర్ ఏజెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెడికల్ రికార్డ్ స్పెషలిస్టుల ఉద్యోగాలు కూడా రిస్క్ లిస్టులో ఉన్నాయి. అయితే శారీరక శ్రమతో కూడిన వంట మనుషులు, లైఫ్ గార్డ్‌లు, అంట్లు కడిగే వారి పనులను ఏఐ కనీసం ముట్టుకోలేకపోయింది. అంటే చేతి వృత్తులపై ఆధారపడిన వ్యక్తులకు ఏఐ వల్ల జాబ్ లాస్ ముప్పు దాదాపుగా లేనట్టే చెప్పుకోవాలి.
మరి ఇప్పటికే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం మొదలైందా? అంటే.. ఈ రీసెర్చ్ ప్రకారం ఇంకా భారీ స్థాయిలో ఉద్యోగాల కోత స్టార్ట్ కాలేదని తేలింది. అయితే కొన్ని ప్రమాద సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 22 నుండి 25 ఏళ్ల వయసున్న యువతకు, ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండే రంగాల్లో కొత్త నియామకాలు తగ్గుముఖం పట్టాయి. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను ఏఐ టూల్స్ సులభంగా చేసేస్తుండటమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం సంక్షోభం కాకపోయినా.. రానున్న పెద్ద మార్పునకు ఇదొక హెచ్చరిక అని నిపుణులు అంటున్నారు.
