క్రికెట్లో చోకర్స్ ఎవరు..? ఈ ప్రశ్న వినగానే వెంటనే రెండు జట్లు గుర్తొస్తాయి. ఒకటి న్యూజిలాండ్ మరొకటి సౌతాఫ్రికా. ప్రతిసారి ఐసీసీ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగడం.. లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్ములేపి అందరికంటే ముందుగా సెమీస్‌కు చేరడం.. సెమీస్‌లో అనూహ్యంగా ఇంటిదారి పట్టడం.. ఇది ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల పరిస్థితి. అయితే రెండు జట్లలో అసలైన చోకర్ ఎవరనే ప్రశ్నకు సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ సమాధానమిచ్చాడు. కివీస్ జట్టుపై సెటైర్ విసిరి సంచలన కామెంట్స్ చేశాడు. ఇంతకీ స్టెయిన్ ఏం చెప్పాడు.. అసలు 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఏ జట్టుకు సపోర్ట్ చేస్తున్నాడు.. ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా జట్టు మరోసారి సెమీ ఫైనల్లో ఓడిపోయి ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్ పై జరిగిన సెమీ ఫైనల్లో చిత్తుగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయింది. మరోవైపు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన కివీస్ జట్టు వార్ వన్ సైడ్ చేసింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 170 పరుగుల టార్గెట్ ఫినిష్ చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది.
క్రికెట్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సఫారీ జట్టుకు ఐసీసీ టోర్నీలో ఇదే అలవాటుగా మారింది. ఐసీసీ టోర్నీ అంటే వారికి అసలు కలిసి రావడం లేదు. జట్టు బలంగా ఉన్నా ఏదో రూపంలో బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంటుంది. సూపర్-8 వరకు ఓటమి లేని జట్టుగా తిరుగు లేని విజయాలతో అదరగొట్టిన సౌతాఫ్రికా జట్టు సెమీ ఫైనల్లో ఘోరంగా ఓడిపోవడంతో మరోసారి చోకర్స్ ట్యాగ్ వైరల్ అవుతుంది. అయితే క్రికెట్ లో తమకంటే న్యూజిలాండ్ జట్టు పెద్ద చోకర్ అని ఈ సౌతాఫ్రికా మాజీ పేసర్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికా కంటే ఎక్కువ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడిందని.. అందువల్ల మరో ఐసీసీ ఈవెంట్ ఫైనల్‌లో కూడా కివీస్ జట్టు ఓడిపోతే చోకర్స్ అనే ట్యాగ్ వారికే వర్తిస్తుందని స్టెయిన్ అన్నాడు. న్యూజిలాండ్ టైటిల్ విజేతగా నిలవాలని తాను నిజంగా కోరుకుంటున్నానని.. అయితే అహ్మదాబాద్‌లో ఇండియాపై విజయం సాధించడం అసాధ్యమని స్టెయిన్ జోస్యం చెప్పాడు. సౌతాఫ్రికాను చాలామంది చోకర్స్ అని పిలుస్తారు. కానీ న్యూజిలాండ్ చాలా వరల్డ్ కప్ ఫైనల్స్ కు వెళ్లినా గెలవలేకపోయారు. మా కంటే వారు ఎక్కువ ఫైనల్స్ ఆడారు. కాబట్టి అసలైన చోకర్స్ అనే ట్యాగ్ వారికే చెల్లుతుందని స్టెయిన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎబి డివిలియర్స్‌తో జరిగిన చాట్‌లో అన్నాడు.
గత పదేళ్లలో న్యూజిలాండ్ 2015, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ తో పాటు 2021 టీ20 వరల్డ్ కప్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడింది. ఈ నాలుగు ఫైనల్స్ లోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది. తాజాగా 2026 టీ20 వరల్డ్ కప్ లో మరోసారి ఫైనల్ కు చేరుకుంది. ఈ ఫైనల్ న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్న స్టెయిన్.. ఒకవేళ ఓడిపోతే మాత్రం అతి పెద్ద చోకర్స్ ట్యాగ్ వారిదే అని చెప్పాడు. దీంతో ఓ వైపు కివీస్ జట్టుకు సపోర్ట్ చేస్తూనే మరోవైపు తమ దేశం సౌతాఫ్రికాను చోకర్స్ ట్యాగ్ నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
