ఐసీసీ 2026 టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నామినేషన్లను ప్రకటించింది. నెలపాటు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చిన టీ 20 వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి ఎండ్ కార్డు పడుతుంది. వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ఐసీసీ.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం ఎనిమిది మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో ఇండియన్ ప్లేయర్ సంజు శాంసన్ స్థానం దక్కించుకోగా.. ఆశ్చర్యకరంగా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం దక్కలేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం ఎంపికైన 8 మంది ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1) సంజు శాంసన్:
శాంసన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఆడి ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్ ల్లో 232 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్ లో నిలిచాడు. సూపర్-8లో వెస్టిండీస్ పై చేసిన 97 పరుగులతో పాటు సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై 89 పరుగులు చేసి రెండు మ్యాచ్ ల్లో ఇండియాకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సంజు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్ లో ఉండడం విశేషం.
2) విల్ జాక్స్:
సెమీ ఫైనల్లో ఓడిపోయినా ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాడు. జాక్స్ ఈ టోర్నమెంట్లో తన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. ఆడిన 8 మ్యాచ్ ల్లో 176.56 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కూడా జాక్స్ రాణించి 9 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీలో నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఇంగ్లాండ్‌ను సెమీస్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సెమీస్‌లోనూ టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్లను పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ రాణించి 20 బంతుల్లోనే 35 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
3) లుంగీ ఎంగిడి:
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి తన సూపర్ బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 12 వికెట్లు తీసి జట్టులో మోస్ట్ సక్సెస్ ఫుల్ బౌలర్ గా మారాడు. ఈ సఫారీ బౌలర్ ఎకానమీ కేవలం 7.19 ఉండడం విశేషం. తనదైన స్లో బాల్స్ తో ఎంగిడి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ తన జట్టు సౌతాఫ్రికా ఓడిపోవడంతో ఈ టోర్నీలో ఎంగిడి కథ ముగిసింది.
4) ఐడెన్ మార్క్రామ్:
సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఈ టోర్నీలో అత్యంత నిలకడగా రాణించిన ఆటగాళ్లలో ఒకడు. టోర్నీలో దాదాపు ప్రతి మ్యాచ్ లో మార్కరం తన బ్యాటింగ్ తో జట్టుకు మంచి ఆరంభాలను ఇచ్చాడు. 8 ఇన్నింగ్స్ ల్లో 47యావరేజ్ తో 286 పరుగులు చేశాడు. వీటిలో లీగ్ దశలో న్యూజిలాండ్ పై చేసిన 86 పరుగులు టోర్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది. మార్కరంకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది.
5) సాహిబ్జాదా ఫర్హాన్:
పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ప్రస్తుతం టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆడిన 6 మ్యాచ్ ల్లో 76 యావరేజ్ తో 383 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. వీటిలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఒత్తిడిలోనూ రాణించి ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఒకే టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ (2014) పేరిట ఉన్న 319 పరుగుల రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. జట్టు సెమీ ఫైనల్ కు రాకున్నా ఫర్హాన్ టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. ఫైనల్లో సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడకపోతే ఈ పాక్ ఓపెనర్ కు "ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్" అవార్డు వచ్చే అవకాశాలున్నాయి.
6) షాడ్లీ వాన్ షాల్క్విక్:
అమెరికా జట్టు కనీసం సూపర్-8కు చేరకపోయినా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్ లో ఉండడం విశేషం. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఏకంగా 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాతో ఆడిన ప్రారంభ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలింగ్ వేశాడు. అంతేకాదు ఈ టోర్నీలో ఆడింది నాలుగు మ్యాచ్ లే అయినా ప్రస్తుతం లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. షాల్క్విక్ యావరేజ్ కేవలం 7.7 మాత్రమే ఉంది. ఎకానమీ పరంగా చూసుకున్నా 6.8 మాత్రమే ఉండడం షాకింగ్ కు గురి చేస్తుంది.
7) రచిన్ రవీంద్ర:
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర తన ఆల్ రౌండ్ షో తో టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేస్ లో నిలిచాడు. బ్యాటింగ్ లో పెద్దగా రాణించకపోయినా బౌలింగ్ లో ఆకట్టుకున్నాడు. ఆడిన 8 మ్యాచ్ ల్లో 128 పరుగులు చేసిన ఈ కివీస్ ఆల్ రౌండర్ బౌలింగ్ లో 11 వికెట్లు తీసుకొని అదరగొట్టాడు.
రచీన్ ముఖ్యంగా సూపర్-8, సెమీ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు ఫైనల్ కు రావడంలో కీలక పాత్ర పోషించారు. పొదుపుగా బౌలింగ్ చేసిన రవీంద్ర ఎకానమీ కేవలం 6.88 మాత్రమే ఉండడం విశేషం. ఫైనల్లో ఆల్ రౌండ్ షో తో అదరగొడితే రచీన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలిచే అవకాశాలున్నాయి.
8) టిమ్ సీఫెర్ట్:
న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ టోర్నమెంట్ మొత్తం తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆడిన 8 మ్యాచ్ ల్లో 274 పరుగులు చేసి నిలకడగా రాణించాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లో సీఫెర్ట్ జట్టుకు మెరుపు ఆరంభాలను అందించాడు. 45.66 యావరేజ్ తో పాటు 161.17 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. ఫైనల్లో ఇండియాపై భారీ ఇన్నింగ్స్ ఆడితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకోవచ్చు. మరి ఈ నలుగురిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఎవరిని వరిస్తుందో చూడాలి.
