పద్మారావునగర్, వెలుగు: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి సుమారు 100 నుంచి 150 మంది భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ మహంకాళి పీఎస్ఇన్స్పెక్టర్ రమేశ్ గౌడ్ వివరాల ప్రకారం.. మమత (54) అనే మహిళ భక్తులకు తిరుమల దర్శనం, సేవా టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1,500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేసింది.
అయితే టికెట్లు అందించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మమతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని న్యూ బోయిగూడలోని సుభాష్ రోడ్ ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
