సెక్రటేరియెట్లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్..శాఖ ఒకరిది, పెత్తనం మరకొరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు: హరీశ్ రావు

సెక్రటేరియెట్లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్..శాఖ ఒకరిది, పెత్తనం మరకొరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు: హరీశ్ రావు
  • సినిమా టికెట్ రేట్ల పెంపుతో సంబంధం లేదన్న సినిమాటోగ్రఫీ మంత్రి: హరీశ్
  • శాఖ ఒకరిది.. పెత్తనం మరకొరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు 
  • మంత్రికి తెలియకుండా నిర్ణయమా?.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదెవరు? 
  • మొన్నటి ఎన్నికల్లో ఓడిన వ్యక్తే దీని వెనకున్నరు?.. కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తున్నది
  • ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నరో బయటపెడ్తమని వెల్లడి 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్లలో కన్నా సెక్రటేరియెట్​లోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్​ సినిమా నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కంట్రోల్​లో ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. 

‘‘ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రేమో ‘నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరకు ఫైల్ రాలేదు’ అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు. సాక్షాత్తు ఒక మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డీ.. మీరు నడుపుతున్నది సర్కారా.. సర్కస్​ కంపెనా? టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొకవైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. సీఎం కుర్చీలో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు. ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం.. అని మైకు పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా రేవంత్​ ఊదరగొట్టిండు. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్?’’ అని ప్రశ్నించారు. 

కేసీఆర్ ప్రభుత్వమే వస్తదన్నందుకు కక్ష..

వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్షగట్టారని హరీశ్ రావు అన్నారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరని, ఇంకో సినిమాకేమో రెండ్రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్​ ఇస్తున్నారని విమర్శించారు. పేరు మరచిపోయారని ఇంకో హీరోను జైలుకు పంపించారని మండిపడ్డారు. నచ్చినోళ్లయితే టికెట్ రేట్​ రూ.600కి పర్మిషన్ ఇచ్చారన్నారు. వారం మొత్తం రేట్లు పెంచుకునేందుకు రెడ్​ కార్పెట్ వేస్తారా? అని ప్రశ్నించారు.  

కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తున్నది..

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పరిస్థితిని చూస్తే జాలేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హోం శాఖ జీవో ఇస్తుందని, ఆ విషయం తనకు తెలియదని మంత్రి అంటున్నారని చెప్పారు. తన శాఖతోనే తనకు ఏ సంబంధం లేదని ఆయన ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. టికెట్ రేట్ల పెంపు సీఎం నిర్ణయమేనని కోమటిరెడ్డి చెప్పకనే చెబు తున్నారని విమర్శించారు. ఈ విషయంలో తెర వెనుక ఉన్న రాజ్యాంగేతర శక్తి పాత్ర ఉంద న్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో.. ఒక్కో సిని మాకు కమీషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో.. అన్ని వివరాలను త్వరలోనే బయట పెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.