కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. 15 పార్లమెంట్​ స్థానాల్లో ఇదే పరిస్థితి

కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. 15 పార్లమెంట్​ స్థానాల్లో ఇదే పరిస్థితి
  •     హైదరాబాద్​లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ
  •     మెదక్ ​మినహా ఎక్కడా ప్రభావం చూపని బీఆర్ఎస్ 
  •     గులాబీ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్​కు షిఫ్ట్
  •     పలుచోట్ల బీజేపీకి తెర వెనుక బీఆర్ఎస్​ సపోర్ట్​!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు నడిచింది. రాజ్యాంగం, రిజర్వేషన్లు, దేశభద్రత, హిందుత్వ తదితర జాతీయ అంశాలే ఎజెండాగా ఈ లోక్ సభ ఎన్నికలు జరగడంతో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేదని, ఆ పార్టీ మూడోస్థానానికే పరిమితమైందని పోలింగ్​సరళిని బట్టి స్పష్టమవుతోంది. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్​నగర్​లాంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ లీడర్లు తెరవెనుక బీజేపీకి సపోర్ట్ ​చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో17 ఎంపీ సీట్లు ఉండగా15 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా,  ఒక్క మెదక్ లో మాత్రమే కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ నడుమ ముక్కోణపు పోటీ కనిపించింది.

ఇక  హైదరాబాద్ లో  ఎంఐఎం, బీజేపీ నడుమ హోరాహోరీ నడిచింది. హైదరాబాద్ లో ఎంఐఎం ప్రభావం తగ్గించేందుకు ఈసారి బీజేపీ బలమైన నేతను బరిలోకి దించింది. పార్టీ అభ్యర్థి మాధవీలతను వ్యూహాత్మకంగా ప్రమోట్​చేసిన బీజేపీ హైకమాండ్, ఓల్డ్ సిటీలో దూకుడుగా ప్రచారం నిర్వహించింది. హైదరాబాద్ లో ప్రధాని సభతో పాటు ఓల్డ్ సిటీలో అమిత్ షా రోడ్ షో నిర్వహించడం, హిందూ ఓట్లు పోలరైజ్​అయ్యేలా చర్యలు తీసుకోవడంతో ఒక దశలో పతంగి పార్టీ కలవరపాటుకు లోనైంది. 

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ​

ఈ సారి లోక్ సభ ఎన్నికలు వివిధ జాతీయ అంశాల చుట్టే తిరిగాయి. మోదీ, అమిత్​షా లాంటి నేతలు తమ ప్రసంగాల్లో దేశభద్రత, ఉగ్రదాడులు, రామాలయం, హిందుత్వ లాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఓట్లడిగారే తప్ప స్థానిక సమస్యలను ఎక్కడా టచ్​చేయలేదు. మొదటి రెండు దశల పోలింగ్​తర్వాత మోదీ అనూహ్యంగా కాంగ్రెస్​పై ఘాటైన విమర్శలు చేశారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచి పెడుతుందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సారి మోదీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తేస్తారని రేవంత్ ఆరోపించారు. అందుకే మోదీ 400  సీట్లను అడుగుతున్నారని లాజిక్​తో కొట్టారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రక్షించుకోవాలంటే కాంగ్రెస్​ పార్టీని గెలిపించాలని ఓటర్లకు కాంగ్రెస్​ నేతలు విజ్ఞప్తి చేశారు. రాహుల్, ప్రియాంక, ఖర్గే లాంటి జాతీయస్థాయి నేతలు కూడా ఇదే అంశాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల హైదరాబాద్​కు కంపెనీలు రాకుండా పోయే ప్రమాదముందని, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్​లో పెట్టుబడులు రాకపోవడానికి ఇదే కారణమని చివరి రెండు రోజుల ప్రచారంలో రేవంత్​ గట్టిగా చెప్పారు.  తద్వారా ఈ ఎన్నికలు కాంగ్రెస్​వర్సెస్​ బీజేపీగా మారిపోయాయి.

ఎజెండా లేని బీఆర్‌ఎస్

ఐదు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన  బీఆర్ఎస్.. పార్లమెంట్​ ఎన్నికలకు తగినట్టు సిద్ధం కాలేదు. తమ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించి, ఢిల్లీకి పంపితే రాష్ట్రానికి ఏమి చేస్తామో ఆ పార్టీ పెద్దలు చెప్పలేకపోయారు. పార్టీకి మేనిఫెస్టో లేక, ప్రచారాస్త్రాలు లేక కేవలం ఐదు నెలల కాంగ్రెస్​పాలనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.

ఓవైపు నియోజకవర్గాల్లో లీడర్లు, కేడర్​ చేజారుతున్నా పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ నిర్వహించిన బస్సు యాత్ర పైనే ఆశలు పెట్టుకున్నారు. తాజా పోలింగ్​సరళిని బట్టి ఒక్క మెదక్ లో మాత్రమే బీఆర్ఎస్​ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​కు గట్టిపోటీ ఇచ్చింది. అక్కడ కూడా రైతులు, మహిళలు, బీసీల​ఓట్లు కాంగ్రెస్ కు పడగా, యూత్, అర్బన్ ఓట్లన్నీ బీజేపీకి పడినట్టు తెలుస్తోంది. ఇక హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.