- గ్లోబల్‌గా మెమరీ చిప్‌ల కొరత.. ధరలు వెయ్యి శాతం పెరిగాయని అంచనా
- రూపాయి పతనంతో కంపెనీలకు పెరిగిన దిగుమతుల భారం
- టీవీల తయారీలో 70 శాతం పార్టులు దిగుమతుల ద్వారానే
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి టీవీల ధరలు 3–4 శాతం మేర పెరగనున్నాయి. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గిపోవడంతో ఎల్‌ఈడీ టీవీ రేట్లు పెంచడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ 90 దాటిన విషయం తెలిసిందే. దీంతో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఎల్‌ఈడీ టీవీల తయారీలో కేవలం 30 శాతం పార్టులు మాత్రమే లోకల్‌గా దొరుకుతున్నాయి. మిగిలిన 70 శాతం పార్టుల కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. రూపాయి విలువ పడిపోవడంతో వీటి దిగుమతులు కాస్ట్లీగా మారాయి. ఓపెన్ సెల్, సెమీకండక్టర్ చిప్స్, మదర్‌బోర్డ్ వంటివి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత నెలకొంది. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌లు అవసరం. చిప్‌ల తయారీ కంపెనీలు ఏఐ చిప్‌లపై దృష్టి పెట్టడంతో టీవీలకు సరఫరా పడిపోయింది. ఫలితంగా డీఆర్‌ఏఎం, ఫ్లాష్ వంటి మెమరీ పార్టుల ధరలు విపరీతంగా పెరిగాయి.
కంపెనీల మాట
ఎల్‌ఈడీ టీవీ ధరలు 3శాతం పెరుగుతాయని హయర్ ఇండియా అధ్యక్షుడు ఎన్‌ఎస్ సతీష్ అన్నారు. కొన్ని కంపెనీలయితే ధరలు పెరుగుతాయని తమ డీలర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చాయి. మెమరీ చిప్ ధరలు గత మూడు నెలల్లో 500శాతం పెరిగాయని, జనవరిలో టీవీల ధరలు 7–10శాతం పెరగొచ్చని థామ్సన్, కోడక్, బ్లూపంక్ట్ బ్రాండ్ల టీవీలను తయారు చేసే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌పీపీఎల్) సీఈఓ అవనీత్ సింగ్ పేర్కొన్నారు. మెమరీ చిప్‌ల ధరలు దిగిరాకపోతే టీవీల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం 32 అంగుళాలకుపైగా టీవీ స్క్రీన్‌లపై జీఎస్‌టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో వీటి ధరలు రూ.4,500 వరకు తగ్గాయి. కానీ కొత్త ధరల పెరుగుదలతో ఈ ప్రయోజనాలు ప్రజలకు అందవని ఎనలిస్టులు
చెబుతున్నారు.
వచ్చే ఏడాది జూన్ వరకు కష్టమే!
డైవా బ్రాండ్‌తో పాటు రిలయన్స్, హావెన్స్, హ్యండాయ్, తోషిబా, కాంపాక్ వంటి బ్రాండ్లకు ఒరిజనల్ డిజైన్ మాన్యుఫాక్చరింగ్ (ఓడీఎం) సర్వీస్‌లు అందిస్తున్న వీడియోటెక్స్‌పై కూడా ఒత్తిడి పెరిగింది. ఫ్లాష్, డీడీఆర్4 ధరలు 1,000 శాతం వరకు పెరిగాయని ఈ కంపెనీ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు. ఏఐ డేటా సెంటర్లకు వీటి సరఫరా మళ్లిందని, ఫలితంగా టీవీలకు కొరత ఏర్పడిందని వివరించారు. ప్రస్తుత పరిస్థితులు వచ్చే ఏడాది జూన్ వరకు కొనసాగొచ్చని అంచనా వేశారు. మెమరీ చిప్‌ల సప్లయ్ పెరిగితే ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ‘‘రూపాయి విలువ తగ్గడంతో దిగుమతి ఖర్చులు పెరిగాయి. పాత స్టాక్ పూర్తయిన తర్వాత టీవీలు కొత్త ధరలతో మార్కెట్లో కనిపిస్తాయి. వీడియోటెక్స్ ఉత్పత్తి షెడ్యూల్ మార్చాం. ఇన్వెంటరీని మెరుగ్గా వాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పెరిగిన ఖర్చులను లాంగ్‌టెర్మ్‌లో భరించడం కంపెనీలకు కష్టమవుతుంది”అని బజాజ్ వివరించారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో భారత స్మార్ట్ టీవీ షిప్‌మెంట్స్ (రవాణాలు) ఏడాది లెక్కన 4శాతం తగ్గాయి. చిన్న స్క్రీన్ సెగ్మెంట్‌లో కొత్త డిమాండ్ లేకపోవడం, వినియోగదారుల ఖర్చులు తగ్గడం ఇందుకు కారణం.
