- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాదే గెలుపు: మహేశ్ గౌడ్
- బీఆర్ఎస్ తరిగే పార్టీనే.. ఇక పెరగదు
- కేడర్ చెల్లాచెదురైంది
- మంత్రివర్గ ప్రక్షాళన ఉంటది
- ఢిల్లీ తెలంగాణ భవన్లోపీసీసీ చీఫ్ చిట్ చాట్
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం అనేది తమకు నల్లేరు మీద నడకే అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘‘వచ్చే ఎన్నికల గురించి మాకు ఆందోళనే లేదు. మళ్లీ అధికారం మాదే. బీఆర్ఎస్ తరిగే పార్టీనే..ఇక పెరగదు. బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు’’అని మహేశ్ గౌడ్ అన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరీ బ్లాక్‌లో ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘బీఆర్ఎస్ ఇక గతమే. కిందిస్థాయిలో బీఆర్ఎస్ కేడర్ చెల్లాచెదురు అయిపోయింది. పదేండ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది.
వేరేవాళ్లు చెప్తే ఆలోచించేవాళ్లేమో కానీ.. ఆమె చెప్పేసరికి అందరూ నమ్ముతున్నరు. జైలుకు వెళ్లొచ్చినోళ్లంతా సీఎంలు అవుతున్నారని, అయితే.. తనెందుకు కావొద్దని కవిత ఆశపడుతున్నరు. అనుకోకుండా ఒకసారి కవిత కలిసినప్పుడు తన మనుసులోని మాట చెప్పింది. గో.. హెడ్.. అని సూచించాను. అయితే.. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ.. అత్యాశ ఉం డొద్దు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్‌కు ఎప్పటికీ రాదు. హరీశ్ రావు దెబ్బేయడం ఖాయం’’అని అన్నారు.
ఇక బీజేపీ అధిష్టానానికి కూడా తెలంగాణ పరిస్థితి తెలుసు. వాళ్లు కోరుకునే కుల, సామాజిక పరిస్థితి తెలంగాణలో లేదు. ముస్లిం, మైనార్టీ, ఎస్సీ వర్గాలు బీజేపీని ఎప్పటికీ ఒప్పుకోవు. ఆ పార్టీకి సుమారు 60 నుంచి 70 స్థానాల్లో కనీసం కేడర్ లేదు. బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఇది తెలుసు. వాళ్లు కూడా పక్కచూపులు చూస్తున్నారు. అయితే, మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యేలు అయినా వాళ్ల నియోజకవర్గ అభివృద్ధికి సీఎం నిధులు కేటాయిస్తున్నరు’’ అని మహేశ్ గౌడ్ అన్నారు.
నేను మంత్రివర్గంలోకి పోను
మంత్రివర్గ ప్రక్షాళనకు అవకాశం ఉందని మహేశ్ గౌడ్ అన్నారు. అయితే శాఖలే మారుస్తారా? మంత్రుల నే మారుస్తారా? అనేది స్పష్టత లేదని తెలిపారు. అవన్నీ హైకమాండ్, సీఎం పరిధిలోని అంశాలని చెప్పారు. ‘‘మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొల గిస్తారనే ప్రచారంలో నిజం లేదు.
వాళ్లిద్దరూ కాంగ్రెస్ నుంచి వచ్చినోళ్లు. అలాగే, నేను మంత్రివర్గంలోకి వెళ్తు న్నా అంటూ వస్తున్న వార్తలు అబద్ధం. పార్టీ కోసం పనిచేయడమే నాకు ఇష్టం. పీసీసీ చీఫ్ అంటే పార్టీలో కీలకం’’అని మహేశ్ గౌడ్ అన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
కొందరు ఐఏఎస్ ఆఫీసర్ల తీరు సరిగా లేదని మహేశ్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేయాల్సిందే అని, కొందరు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ‘‘మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రైవేట్ కార్యక్రమం. అయితే, తెలంగాణ దృష్టి ప్రపంచ దేశాలపై పడుతుందనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది.
పార్లమెంట్లో ప్రియాంక ప్రసంగం అద్భుతంగా ఉంది. నెహ్రూ దేశానికి చేసిన సేవను మోదీ అవమానించేలా మాట్లాడడం సరికాదు’’అని మహేశ్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ విజనరీ లీడర్ అని.. గ్లోబల్ సమిట్ ఊహకు మించి సక్సెస్ అయిందన్నారు.
