- 61 మిసైల్స్, 34 డ్రోన్లను అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్
- కొన్ని నౌకపై పడడంతో మంటలు.. ఒకరి మృతి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇందులో భాగంగా బహ్రెయిన్‌లోని మనామాలో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ బేస్‌పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. 61 మిసైల్స్, 34 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకొని కూల్చివేసింది. కానీ కొన్ని బేస్‌పై పడ్డాయి. వాటి పేలుడు ప్రభావం వల్ల ఒకరు మరణించాడు.
అయితే ఈ 5వ ఫ్లీట్ బేస్ వద్ద కొంత నష్టం జరిగినట్టు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ఆ బేస్ నుంచి పొగలు ఎగసిపడుతున్నాయి. బహ్రెయిన్ పోర్ట్‌లో ఒక నౌక హిట్ అయి మంటలు అంటుకున్నాయి. అయితే సిబ్బంది వెంటనే వాటిని ఆర్పేశారు. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. అక్కడికి సమీప ప్రాంతాల్లోని ఎత్తైన భవనాలు, హోటల్స్, షాపింగ్ సెంటర్లు, ఎయిర్‌పోర్ట్‌లపై కూడా మిసైల్స్, డోన్లు ఎటాక్ చేశాయి. దీంతో కొన్ని బిల్డింగ్స్దెబ్బతిన్నాయి.
అమెరికా 5వ ఫ్లీట్‌లో 20కి పైగా నౌకలు, 16 వేల మంది సైనికులు ఉన్నారు. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం మరింత విస్తరిస్తుందనే భయాలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి.
