దుబాయ్/టెహ్రాన్: మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో టెహ్రాన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల తమ దేశంపై ఇరాన్ క్షిపణి దాడులు జరపడంతో దౌత్య సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. యూఏఈలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు జరిపింది.
ఈ అటాక్స్ దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని యూఏఈ ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది. టెహ్రాన్‌లోని ఎంబసీని మూసివేయడంతో పాటు అక్కడ పనిచేస్తున్న దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తమ అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్టు యూఏఈ వెల్లడించింది.
బాగ్దాద్‌లోని అమెరికా దళాలపై..ఇరాకీ మిలిషియా గ్రూప్ వెల్లడి
దుబాయ్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా బేస్‌లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి చేసినట్లు ఇరాకీ షియా మిలిషియా సోమవారం ప్రకటించింది.
ఈ దాడికి సంబంధించి అమెరికా, ఇరాక్ ప్రభుత్వాలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కాగా, 2003లో సద్దాం హుస్సేన్‌ను గద్దె దించిన అమెరికా.. అక్కడ అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న షియా మిలిషియా గ్రూపుల్లో సారాయా అవులియా అల్‌దమ్ ఒకటి.
