గల్ఫ్ తీరంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రాంతీయంగా విస్తరించడం, ప్రపంచంలోనే అతిపెద్ద LNG(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఖతార్ తన ఉత్పత్తిని నిలిపివేయడం పెను సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే అట్లాంటిక్ బేసిన్‌లో ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ల అద్దె ధరలు ఆకాశాన్ని తాకాయి. షిప్ యజమానులు, బ్రోకర్లు ఒక్కో నౌకకు రోజుకు 2లక్షల డాలర్ల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తుండటంతో షిప్పింగ్ రంగం ఆశ్చర్యపోతోంది.
మునుపటి రోజు ధరలతో పోలిస్తే ఇది దాదాపు డబుల్. సోమవారం ఉదయం నాటికి స్పార్క్ కమోడిటీస్ అనే షిప్పింగ్ సంస్థ అంచనా వేసిన ధర 61వేల 500 డాలర్లుగా ఉంది. కానీ ప్రస్తుత ఆఫర్ ధరలు ఆ అంచనా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ భారీ ధరలకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ఒప్పందాలు జరగలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఇది కేవలం డిమాండ్ స్థాయిలోనే ఉందని, క్షేత్రస్థాయిలో లావాదేవీలు ఇంకా కొలిక్కి రాలేదని వ్యక్తులు గోప్యంగా వెల్లడించారు.
ఈ హఠాత్ పరిణామం వెనుక భౌగోళిక రాజకీయ కారణాలు బలంగా ఉన్నాయి. ఖతార్, అబుదాబి వంటి ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గింపు దీర్ఘకాలం కొనసాగితే తప్ప, వాస్తవ లావాదేవీల రేట్లు స్థిరంగా ఇంత భారీ స్థాయిలో ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రెసిషన్ ఎల్‌ఎన్‌జీ కన్సల్టింగ్ నిపుణుడు రిచర్డ్ ప్రాట్ అభిప్రాయం ప్రకారం.. అమెరికా నుండి ఆసియా దేశాలకు గ్యాస్ తరలించాలంటే నౌకలు ప్రయాణించాల్సిన దూరం కూడా పెరుగుతుంది. ఈ అదనపు ప్రయాణ భారం కూడా అద్దె రేట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మొత్తానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న అశాంతి ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీస్తోంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణగకపోతే, ఇంధన రవాణా ఖర్చులు పెరిగి అది చివరకు వినియోగదారులపై భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మార్కెట్ మొత్తం ఈ ఉద్రిక్తతలు ఎటువైపు దారితీస్తాయోనని గమనిస్తోంది.
