V6 News

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతకు మైకులు బంద్..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతకు మైకులు బంద్..!

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతుండగా, రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటలతో మైకులు బంద్​ అయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముగించి, ప్రలోభాలపై నజర్​పెట్టారు. డబ్బు, మద్యంతో పాటు చీరలు, చికెన్​ పంపిణీపై కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రెండో విడతలో కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

 వీటిలో 23 గ్రామాలు ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 160 గ్రామాల్లో 451 మంది పోటీలో ఉన్నారు. ఇక 1,686 వార్డులకు గాను 306 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఒక వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదు. మిగిలిన 1,379 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో 3,352 మంది బరిలో నిలిచారు. 

ప్రచారం క్లోజ్ అవుతుండడంతో, చివరి రోజు అభ్యర్థులు జోరు పెంచారు. సర్పంచ్​ క్యాండేట్లు, వార్డు మెంబర్లను వెంటబెట్టుకొని ఇంటింటి ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి తమ గుర్తుతో ముద్రించిన పాంప్లేట్స్​ను పంచుతూ తమ హామీలను వివరించారు. అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్​ రెడ్డి, తుంబూరు దయాకర్ రెడ్డి ప్రచారం చేశారు.

 క్యాంపెయిన్ ముగిసిన తర్వాత ఎలాగైనా గెలవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ప్రత్యర్థి శిబిరంలోని కింది స్థాయి నాయకులను అంతర్గతంగా తమకు సహకరించాలంటూ ప్రలోభ పెడుతున్నారు. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి, తమకే ఓటేసేలా హామీ తీసుకుంటున్నారు. దాంతో పాటు ఇవాళ మద్యం, చికెన్​ పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. 

బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది సిద్ధం..!

రెండో విడత ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. 1,831 పోలింగ్ అధికారులు, 2,346 మంది ఓపీవోలను సిద్ధం చేశారు. రెండవ విడతలో 28 లొకేషన్స్ లో 304 క్రిటికల్ కేంద్రాలు ఉండగా, అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2,51,327 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,21,164 మంది పురుష ఓటర్లు, 1,30,156 మంది మహిళా ఓటర్లు, ఏడుగురు ఇతర ఓటర్లు ఉన్నారు.  

మూడో విడతలో ప్రచార జోరు..!

మరోవైపు మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, కారేపల్లి, తల్లాడ, వేంసూరు మండలాల్లోని 191 గ్రామాల్లో మూడో విడతకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరో రెండ్రోజులు మాత్రమే గడువు ఉండడంతో గుర్తులను చూపిస్తూ, ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు మొదటి విడత ఎన్నికలు జరిగిన 172 గ్రామాల్లో 143 గ్రామాల్లో ఉప సర్పంచ్​ ఎన్నిక పూర్తి కాగా, 29 చోట్ల వాయిదా పడింది. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో.. 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలోని 155 గ్రామపంచాయతీలకు గానూ 16 ఏకగ్రీవం అయ్యాయి. ఒక చోట నామినేషన్లు దాఖలు కాలేదు. ఎన్నికలు జరుగనున్న 138 గ్రామపంచాయతీల్లో 386 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1384 వార్డులకు గానూ 13 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు. 248వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1,123 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా 2,820 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.     

సై అంటే సై..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​, సీపీఐ కలిసి పోటీ చేశాయి.  కాగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​, సీపీఐ ఢీ అంటే ఢీ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్​ తరఫున ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 

అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్​ తరుఫున ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా ప్రచారం చేపట్టారు. బీఆర్​ఎస్​ తరుఫున మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావుతో పాటు ఆయన కొడుకు వనమా రాఘవ ప్రచారంలో పాల్గొన్నారు. 

మొదటి విడత ఫలితాలను సమీక్షిస్తూ :మొదటి విడతలో వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తూ పార్టీలు తమ మద్దతు దారులను గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. రెండో విడతలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు లోపాయికారీ పొత్తులకు ఆయా పార్టీల నేతలతో పాటు అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. ప్రలోభాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.