IND vs SA: మూడో టీ20 మనదే.. సౌతాఫ్రికాపై టీమిండియా ఈజీ విక్టరీ

IND vs SA: మూడో టీ20 మనదే.. సౌతాఫ్రికాపై టీమిండియా ఈజీ విక్టరీ

సౌతాఫ్రికాతో ముగిసిన మూడో టీ20లో టీమిండియా విశ్వరూపం చూపించింది. సఫారీలను చిత్తుచిత్తుగా ఓడించి భారీ విజయాన్ని అందుకుంది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. మొదట బౌలర్లు చెలరేగి సఫారీలను స్వల్ప స్కోర్ కే ఔట్ చేయగా.. ఈజీ ఛేజింగ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ వేగంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి గెలిచింది. 

118 పరుగుల టార్గెట్ లో టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ తనదైన శైలిలో   చెలరేగి 16 పరుగులు రాబట్టాడు. గిల్ కూడా బ్యాట్ ఝులిపించడంతో రెండో ఓవర్లో 16.. మూడో ఓవర్లు 10 పరుగులు వచ్చాయి. వీరిద్దరి జోరుతో ఇండియా పవర్ ప్లే లో 68 పరుగులు రాబట్టింది. ఆరో ఓవర్లో ఒక భారీ షాట్ కు ప్రయత్నించి అభిషేక్ (35) ఔటయ్యాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత టీమిండియా దూకుడు బాగా తగ్గింది. పరుగులు చేయడానికి గిల్, తిలక్ వర్మ తీవ్రంగా శ్రమించారు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన గిల్ 28 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఫామ్ లో లేని సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేయడానికి కావాల్సిన సమయం తీసుకున్నాడు. లక్ష్యం మరీ చిన్నగా ఉండడంతో సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. స్వల్ప లక్ష్యం కావడంతో ఇండియా చిన్నగా ఆడుతూ విజయాన్ని ఖాయం చేసుకుంది. సూర్య (12) ఔటైనా.. దూబే 16 ఓవర్లో సిక్సర్, ఫోర్ తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టీ20 బుధవారం (డిసెంబర్ 17) అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. 

టీమిండియా బౌలర్ల విజృంభణ:  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు ఘోరమైన ఆరంభం లభించింది. టీమిండియా పేసర్లు హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ ధాటికి సఫారీ బ్యాటర్లు వరుస బెట్టి పెవిలియన్ చేరారు. తొలి ఓవర్లో రీజా హెండ్రిక్స్ ను అర్షదీప్ ఔట్ చేసి అదిరిపోయే శుభారంభం ఇచ్చాడు. రెండో ఓవర్లో హర్షిత్ రానా గత మ్యాచ్ సెంచరీ హీరో క్వింటన్ డి కాక్ ను పెవిలియన్ కు చేర్చాడు. నాలుగో ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ ను హర్షిత్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా 7 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా తొలి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసింది. 

పవర్ ప్లే తర్వాత స్టబ్స్ (9) ను హార్దిక్ పాండ్య ఔట్ చేయడంతో 30 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత దూబే తన తొలి ఓవర్ లోనే ఒక స్టన్నింగ్ డెలివరీతో బాష్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సఫారీలు 44 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. డోనోవన్ ఫెర్రీరా 20 పరుగులు చేసి పర్వాలేదనిపించినా క్రీజ్ లో ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోవడంతో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్ కూడా చేయలేకపోయింది. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మార్కరం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టు స్కోర్ ను 100 పరుగులు దాటించాడు.