- 45 నుంచి 59 ఏండ్ల మధ్యే ఎక్కువ మంది మగాళ్లు చనిపోతున్నారు
- ఎస్ఆర్ఎస్ 2022 డేటా ఆధారంగా కేరళ యూనివర్సిటీ అనాలసిస్
- నడివయసు మగాళ్ల ప్రాణాలకే రిస్క్ ఎక్కువని తేల్చిన రిపోర్ట్
- ఏపీ, కర్నాటకలోనూ సేమ్ సీన్.. కేరళలో మాత్రం మగాళ్లకు 78 ఏండ్ల దాకా ఢోకాలేదు
- 45 నుంచి 60 ఏండ్ల వయసు వాళ్ల కోసం హెల్త్ స్కీములు తీసుకురావాలన్న స్టడీ
- 35 ఏండ్లు దాటితే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఆడోళ్లకే ఆయుష్షు ఎక్కువ. ఇదేదో సామెత కోసం చెప్తున్నది కాదు. సోషల్ సైన్స్ చెప్తున్న నిజం. మగాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ కాలం బతుకుతున్నరు. మన రాష్ట్రంలో మగవాళ్లు నడివయసులోనే రాలిపోతుంటే.. మహిళలు 70 ఏండ్లు దాటినా గట్టిగా నిలబడుతున్నరు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆడ, మగ ఆయుష్షులో తేడాపై ఇటీవల కేరళ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో ఈ విషయం తేలింది. అసలు ఆయుర్దాయం విషయంలో ఆడ, మగ మధ్య ఈ తేడా ఎందుకు వస్తుంది? ఏ వయసులో మగాళ్లు రిస్క్‌లో పడుతున్నరు? అనే అంశాల మీద తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించి 2022 నాటి ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ డేటా ఆధారంగా అరియాగా అప్రోచ్ పద్ధతిలో ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విశ్లేషణ చేశారు.
ఈ రీసెర్చ్ లో మన రాష్ట్రానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీ ఇటీవలే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ సైన్సెస్ లో పబ్లిష్ అయింది. సాధారణంగా ఆయుర్దాయం అనేది మన హెల్త్, సోషల్ లైఫ్, ఆర్థిక పరిస్థితి, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. పలు రీసెర్చ్ ల ప్రకారం ఒకప్పుడు చిన్నపిల్లల్లో చావులు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులోకి రావడం వల్ల శిశు మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఓవరాల్ గా చూసినప్పుడు సగటు మనిషి ఆయుర్దాయం పెరిగినా.. మగాళ్లకు, ఆడాళ్లకు మధ్య గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది.
మగాళ్లలో మిడిల్ ఏజ్ డెత్స్..
రిపోర్టులో పేర్కొన్న డేటా ప్రకారం.. ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లలో మిడిల్ ఏజ్ డెత్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆయుర్దాయ అసమానతలకు అతి పెద్ద కారణం 45 నుంచి 59 ఏండ్ల వయసు వాళ్లే. ఈ గ్రూప్ వల్లే ఆయుర్దాయంలో ఏకంగా 4 ఏండ్ల దాకా తేడా వస్తున్నట్టు ఈ స్టడీ తేల్చింది. అంటే ఈ వయసులో చనిపోయేటోళ్లే ఎక్కువ ఉన్నారని స్పష్టమవుతోంది.
ఇక నడివయసు తర్వాత.. 65 నుంచి 79 ఏండ్ల మధ్య ఉన్నోళ్లు కూడా ఈ వ్యత్యాసానికి కారణం అవుతున్నారు. కాకపోతే 45–59 ఏండ్ల వాళ్లకంటే వీళ్ల ప్రభావం కొంచెం తక్కువగానే ఉంది. మన దగ్గర 20 ఏండ్ల లోపు పిల్లలు, కౌమర దశలో ఉన్నోళ్ల మరణాలు బాగా తగ్గాయి. ఆయుర్దాయం తేడాల్లో వీరి వాటా చాలా తక్కువని ఈ స్టడీని చూస్తే అర్థమవుతోంది. కేవలం ఒక్క గ్రూప్ అనే కాదు.. ఓవరాల్ గా చూస్తే మన రాష్ట్రంలో35 నుంచి 69 ఏండ్ల మధ్య అంటే మిడిల్, ఓల్డర్ అడల్ట్ ఏజ్ లో ఉన్నవాళ్ల మరణాల వల్లనే ఆయుర్దాయం దెబ్బతింటున్నది. ఇప్పుడు ఫోకస్ అంతా ఈ నడివయసు వాళ్ల ఆరోగ్యం మీదనే పెట్టాలని స్టడీ సూచిస్తోంది.
కేరళ ఓకే.. మిగతా రాష్ట్రాలే..
దక్షిణాది రాష్ట్రాలన్నింటితో పోలిస్తే ఆయుర్దాయంలో కేరళ అందరికంటే టాప్ ప్లేస్ లో నిలిచింది. అక్కడ మగవాళ్లు సగటున 72 ఏండ్లు, మహిళలు ఏకంగా 78 ఏండ్లు బతుకుతున్నారు. అక్కడి హెల్త్ సిస్టమ్ చిన్న పిల్లలకే కాదు.. వృద్ధులకు, నడివయసు వారికి కూడా అండగా ఉండటమే ఇందుకు కారణం. ఆ తర్వాత తమిళనాడు (పురుషులు 71, మహిళలు 75) పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రం ఆయుష్షు విషయంలో వెనకబడి ఉన్నాయి.
ఇక మన రాష్ట్రంలో ఆయుర్దాయం అందరికీ సమానంగా ఉండాలంటే.. 20 ఏండ్ల లోపు పిల్లలను కాపాడుకున్నట్టే.. 45 నుంచి 60 ఏండ్ల వయసు వాళ్లను కూడా కాపాడుకోవాలని హెల్త్ ఎక్స్పర్ట్స్సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ వయసు వాళ్ల కోసం స్పెషల్ హెల్త్ స్కీమ్స్ తీసుకురావాలని, అప్పుడే లైఫ్ ఎక్స్పెండెన్సీ పెరుగుతుందని ఈ స్టడీ స్పష్టం చేసింది.
ఈ స్టడీ ప్రభుత్వాలకు, సమాజానికి పలు సూచనలు చేసింది. ఇన్నాళ్లు ప్రభుత్వాలు శిశు మరణాలను తగ్గించడంపైనే ఫోకస్ పెట్టాయని.. ఇకపై 35 ఏండ్లు దాటినవారి ఆరోగ్యంపై, వారి లైఫ్ స్టైల్ మార్పులపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రజలు కూడా 35 దాటగానే రెగ్యూలర్ గా హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని స్పష్టం చేసింది.
ఆడకు.. మగకు.. ఆరేండ్లు తేడా..
మన రాష్ట్రంలో మగవాళ్ల సగటు ఆయుష్షు కేవలం 67.70 ఏండ్లు మాత్రమే ఉండగా.. మహిళల సగటు ఆయుష్షు ఏకంగా 73.73 ఏండ్లుగా నమోదైంది. అంటే సగటున మగాళ్ల కన్నా మహిళలు దాదాపు ఆరున్నరేండ్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పురుషులు సగటున 67.33 ఏండ్లకే చనిపోతుంటే.. మహిళలు 72.38 ఏండ్లు జీవిస్తున్నారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్లు కనీసం 70 ఏండ్లు కూడా నిండకుండానే కన్నుమూస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వృద్ధాప్యంలోనూ మగవారి కంటే స్త్రీలే ఎక్కువ కాలం బతుకుతున్నట్టు ఈ డేటా స్పష్టం చేసింది.
కాగా, మగవాళ్లలో ఆయుర్దాయం తగ్గడానికి కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి ఒక కారణమైతే.. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణం. దీనికి తోడు బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక రోగాలు మగవారిని 60 ఏండ్లు కూడా దాటనివ్వడం లేదు.
పైగా ఆరోగ్యం విషయంలో మగవారిలో ఉండే నిర్లక్ష్యం కూడా దీనికి ఆజ్యం పోస్తున్నది. అదే మహిళల విషయానికి వస్తే.. వారికి పుట్టుకతోనే వ్యాధులను తట్టుకునే శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే దురలవాట్లు తక్కువగా ఉండటం వల్ల వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
