- దేవాదాయ భూముల్లో సమగ్ర సర్వేకు
- ప్రభుత్వం శ్రీకారం..
- అనంత టెక్నాలజీస్‌తో ఒప్పందం
- తొలివిడతలో 40 వేల ఎకరాల్లో సర్వే
- దేవాదాయశాఖకు 87 వేల ఎకరాలు..ఇతర రాష్ట్రాల్లో 6 వేల ఎకరాలు
- ఇందులో 20,124 ఎకరాలు కబ్జా..సర్వేతో ఆక్రమణలకు చెక్ పడే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఏండ్ల నుంచీ ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములను కాపాడేందుకు దేవాదాయశాఖ కసరత్తు మొదలెట్టింది. అత్యాధునిక సాంకేతికతతో ఆలయ భూములను సర్వే చేసేందుకు సిద్ధమైంది. ఈ మెగా సర్వే బాధ్యతలను ప్రముఖ సంస్థ అనంత టెక్నాలజీస్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే సంస్థకు వర్క్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సర్వే పనులు సజావుగా సాగేందుకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సర్వే బృందాలకు కావాల్సిన రికార్డులు, సరిహద్దుల వివరాలను అందించాలని సూచించారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో తొలి విడతగా 40 ఎకరాల విస్తీర్ణంలో సర్వే నిర్వహించనున్నారు. కాగా, సర్వే పూర్తయిన వెంటనే ఆలయ భూముల వివరాలు, నక్షా హద్దులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వే విజయవంతమైతే రాష్ట్రంలో ఆలయ భూముల రక్షణ, డిజిటలీకరణ, చట్టపరమైన హక్కుల నిర్ధారణలో ఒక మైలురాయిగా నిలువనున్నది.
పెద్ద మొత్తంలో కబ్జా..
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలో సుమారు 87,235 ఎకరాల భూమి రికార్డుల్లో ఉంది. ఇందులో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, కమర్షియల్ స్థలాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆలయ భూములపై పర్యవేక్షణ కొరవడటం.. క్షేత్రస్థాయిలో ఎండో మెంట్ఆఫీసర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. సుమారు 20,124.03 పైగా ఎకరాల భూమి ఆక్రమణదారుల చేతికి చిక్కింది. కోర్టు కేసులు, రాజకీయ జోక్యం, సరైన రికార్డులు లేకపోవడంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ మన ఆలయాలకు స్థిరాస్తులు ఉన్నాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సుమారు 6 వేల ఎకరాల వరకు దేవాదాయశాఖకు సంబంధించిన భూములు ఉన్నట్టు సమాచారం. వీటి పరిరక్షణ కూడా సవాలుగా మారింది.
అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగ్
రాష్ట్రంలో ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రతి ఆలయ భూమికి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్ చేపట్టనున్నారు. ఆక్రమణలు జరగకుండా పక్కాగా బౌండరీలను ఫిక్స్ చేస్తారు. కాగితాల రూపంలో ఉన్న పాత రికార్డులను కంప్యూటరీకరించి, ప్రత్యేక పోర్టల్‌తో అనుసంధానించనున్నారు. ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి, వాటిని లీజుకు ఇవ్వడం లేదా స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆలయాలకు ఆదాయం సమకూరే చాన్స్ఉంది. అనంత టెక్నాలజీస్ సహకారంతో జరగనున్న ఈ సర్వేతో ఏండ్లకొద్దీ పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు చెక్ పడనున్నదని దేవాదాయశాఖ భావిస్తున్నది.
ఆక్రమణల్లో పాలమూరు ఫస్ట్
తొలి విడతలో 40 వేల ఎకరాల్లో ఈ సర్వే చేపట్టనున్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్-సికింద్రాబాద్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహిస్తారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 20,124.03 ఎకరాలు ఆక్రమణలకు గురికాగా.. వితౌట్లిటిగేషన్ తో మరో 5,569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో భూములు ఆక్రమణకు గురయ్యాయి.
ఆ జిల్లాలో 5,522.22 ఎకరాలు ఉండగా.. అందులో 3,018.01 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆఫీసర్లు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4,125.03 ఎకరాలు ఉండగా.. 2,888.18 ఎకరాల భూమి ఆక్రమణతో రెండోస్థానంలో నిలిచింది. ఆక్రమణల్లో హైదరాబాద్ జిల్లా మూడోస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 5,718.01 ఎకరాలు ఉండగా.. 2,374.25 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సికింద్రాబాద్‌లో 279.25 ఎకరాలు ఉండగా 7.12 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 9,360.01 ఎకరాలుండగా.. 1,148.15 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 2,294.26 ఎకరాలుండగా.. 444.16 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 5,429.03 ఎకరాలుండగా.. 688.34 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 6,963.32 ఎకరాలుండగా.. 1,374.35 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2,377.09 ఎకరాలుండగా.. 645.38 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆయా జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆక్రమణదారులు కబ్జా చేశారని తెలుస్తున్నది. భూములకు రక్షణ చర్యలు చేపట్టకపోతే దేవాలయాల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావించిన ప్రభుత్వం ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది.
