- భారత్‌మాల నుంచి పీఎం
- గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కిందకు మార్పు
- గతేడాది నవంబర్ 29న టెండర్లు పిలిచిన ఎన్‌హెచ్‌ఏఐ
- కేంద్ర ఆమోదం లేక ముందుకుసాగని పనులు
- టెండర్ల గడువు పొడిగిస్తూ వస్తున్న ఆఫీసర్లు
- తాజా ప్రకటనతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే నిధులు, పనులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాభివృద్ధిలో ఎంతో కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్త్ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. ఈ రోడ్డు పనులను కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌లోకి మార్చింది. మొన్నటిదాకా భారత్‌మాల ప్రాజెక్ట్‌లో ఉన్న ట్రిపుల్ ఆర్ వర్క్స్‌ను ఇప్పుడు పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కిందకు మార్చారు. ఇదే విషయాన్ని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల స్పష్టం చేశారు. అయితే ట్రిపుల్ ఆర్ నార్త్ పనులకు నిధుల మంజూరుపై కేంద్రం ఇంకా ఎటూ తేల్చలేదు.
ఫోర్‌లేన్ నుంచి సిక్స్ లేన్‌గా మార్చే క్రమంలో రూ.15,647 కోట్లకు పెరిగిన అంచనా వ్యయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపలేదు. 161.5 కిలోమీటర్ల దూరం గ్రీన్ ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఐదు ప్యాకేజీలుగా గతేడాది నవంబర్ 29న టెండర్లు పిలిచింది. సెంట్రల్ నుంచి అప్రూవల్ లేకపోవడంతో ఆఫీసర్లు టెండర్లను తెరవకుండా గడువు పొడిగిస్తున్నారు. మరో నెల రోజులు గడిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌లోనే ట్రిపుల్ నార్త్పనులు మొదలయ్యేలా ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
భారత్‌మాల–1 నుంచి కొత్త ప్రాజెక్ట్‌లోకి...
ట్రిపుల్ ఆర్ నార్త్ పనులపై ఇటీవల కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. రీజినల్ రింగ్ రోడ్డు పనులను పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టనున్నట్లు ప్రకటించారు. గతంలో భారత్ మాల ప్రాజెక్ట్ –1 కింద ఉన్న ట్రిపుల్ ఆర్ నార్త్‌ను కొత్త ప్రాజెక్ట్‌లోకి మార్చడంతో నిధుల కేటాయింపు ఆలస్యం అవుతున్నట్లుగా ఎన్‌హెచ్‌ఏఐ ఆఫీసర్లు చెబుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. దీంతో ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉంది.
అందుకే పెరిగిన అంచనా వ్యయానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఆలస్యం అవుతుందని ఆఫీసర్లు వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మల్టీ- మోడల్ కనెక్టివిటీని అందించడం కొత్త ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. రోడ్లు, రైల్వే, ఓడరేవులు, విమానాశ్రయాలు, జలమార్గాల వంటి వివిధ రవాణా మార్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ కింద పనులు చేపడుతున్నారు. ఇందులో 44 కేంద్ర మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సమీకృతం చేశారు. ముఖ్యంగా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం కోసం ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13న ప్రారంభించారు.
2017లోనే ట్రిపుల్ ఆర్ నార్త్‌కు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం భారత్ మాల ప్రాజెక్ట్–1లో భాగంగా రాష్ట్రంలో ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ చుట్టూ సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు.. హై-స్పీడ్ రవాణా కారిడార్‌ను సృష్టించేందుకు రూ. 36 వేల కోట్ల అంచనా వ్యయంతో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి 2017లోనే ఆమోదం తెలిపింది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దారు.
అయితే, కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్ట్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు వచ్చినా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా చాలా ఏండ్ల పాటు ముందుకెళ్లలేదు. మొత్తం 343.5 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన రోడ్డును నార్త్ పార్ట్161.5 కిలోమీటర్లు, సౌత్ పార్ట్‌ను 182 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మొదట నార్త్ పనులు పూర్తిచేయాలని నాలుగు లేన్స్‌తో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం ప్రాజెక్ట్ డీపీఆర్ రెడీ చేశారు.
టెండర్ల గడువు పెంపు
పెరిగిన నిధులకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడం, కేంద్ర కేబినెట్ ఆమోదం లేకపోవడం, కొత్త ప్రాజెక్ట్‌లోకి మార్చడంతో ఎన్‌హెచ్‌ఏఐ ఆఫీసర్లు టెండర్ల గడువును మరోసారి పెంచారు. మొదట ట్రిపుల్ ఆర్ రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించాలని భావించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ.7,104.06 కోట్లతో 2024 డిసెంబర్‌లోనే టెండర్లు పిలిచారు. అయితే రోజు, రోజుకు పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా ఈ రోడ్డును ఆరు లేన్లుగా మారుస్తూ రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇంజినీర్లతో రీప్రపోజల్స్ రెడీ చేయించారు. దీంతో నార్త్ పార్ట్ రోడ్డు అంచనా వ్యయం రూ.15,627 కోట్లకు పెరిగింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు161.5 కిలోమీటర్ల దూరం గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం పనులను ఐదు ప్యాకేజీలుగా విభజిస్తూ గతేడాది నవంబర్ 29న రెండోసారి టెండర్లు పిలిచారు. టెండర్లకు జనవరి 15 వరకు గడువిచ్చారు. తాజాగా ఈ గడువును మరోసారి పొడిగించారు.
