కేంద్రం నిర్ణయాలతో సంక్షోభంలో వ్యవసాయం : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అరుణ్ కుమార్

కేంద్రం నిర్ణయాలతో సంక్షోభంలో వ్యవసాయం : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అరుణ్ కుమార్
  • సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అరుణ్ కుమార్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: భారత్ లో అమెరికా వస్తువుల దిగుమతిపై 30శాతం టారిఫ్ లు ఉంటే దానిని సున్నా శాతానికి తగ్గించడంతో దేశంలో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సోమవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధిహామీ చట్టం వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టం స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసిందని ఫైర్​అయ్యారు. దీంతో వ్యవసాయ కార్మికులకు ఉపాధి హక్కుగా ఉండబోదని, కూలీల ఉపాధికి ప్రమాదం పొంచి ఉందన్నారు.

అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​ వెస్లీ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్​ ప్రభుత్వం వీటికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు. కేంద్ర బడ్జెట్ లోనూ​ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్​ భూముల్లో పదేండ్ల నుంచి నివాసముంటున్న ఇండ్లను నేలమట్టం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.