99 రోజుల యాక్షన్ ప్లాన్..  ప్రతి జిల్లాకూ టార్గెట్!..నేడు (మార్చి 3) సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌ లో కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్

99 రోజుల యాక్షన్ ప్లాన్..  ప్రతి జిల్లాకూ టార్గెట్!..నేడు (మార్చి 3) సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌ లో కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్
  • లక్ష్యాలు ఛేదించే జిల్లాలకు అదనపు ప్రోత్సాహకాలు
  • మెరుగైన పనితీరు కనబరిచిన ఆఫీసర్లకు ప్రశంసాపత్రాలు
  • గతానికి భిన్నంగా రిజల్ట్‌‌‌‌‌‌‌‌ ఓరియెంటెడ్‌‌‌‌‌‌‌‌ అప్రోచ్‌‌‌‌‌‌‌‌పై చర్చ 

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో  ఈ నెల 6  నుంచి ప్రారంభించనున్న  ప్రజా పాలన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-– ప్రగతి ప్రణాళిక  99 డేస్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీ ఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.  ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశం జరగనుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి వీలుగా కలెక్టర్లందరూ తమ జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరుకావాలని సీఎస్ కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

మధ్యాహ్నం వరకు కలెక్టర్లతో సమావేశం ఉంటుందని, తర్వాత మధ్యాహ్నం 1.45 గంటల నుంచి జరిగే ఉమ్మడి సమావేశానికి ప్రభుత్వ స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌లు, ముఖ్య కార్యదర్శులు కూడా హాజరు కావాలని స్పష్టం చేశారు.  వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాలను సవరించి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి మార్గదర్శనం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగే సమీక్షలో ప్రభుత్వ విధానాల అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. 

రిజల్ట్ ఓరియెంటెడ్‌‌‌‌‌‌‌‌ అప్రోచ్..

పంచాయతీరాజ్, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్ తదితర శాఖల్లో ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించాల్సిన సేవలు, మౌలికవసతుల కల్పనలాంటి వాటిపై సమావేశంలో అజెండా సిద్ధం చేయనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతి జిల్లాకు నిర్దిష్టమైన, కచ్చితమైన టార్గెట్లను సీఎం స్వయంగా నిర్దేశించనున్నట్టు సమాచారం. కేవలం లక్ష్యాలు ఇవ్వడమే కాకుండా, వాటిని సాకారం చేసిన జిల్లాలకు అదనంగా ప్రోత్సాహక నిధులు మంజూరు చేసేలా ప్లాన్ సిద్ధం చేశారు.

విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులను గుర్తించి.. జూన్​ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ రోజున లేదంటే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రాలతో (అప్రిసియేషన్ సర్టిఫికెట్లు) సత్కరించనున్నారు. రొటీన్ సమీక్షలకు భిన్నంగా, ఫలితాల ఆధారిత విధానం (రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్) లో వెళ్లేందుకు ప్రభుత్వం ఈ తరహా కార్యాచరణ సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. పనితీరుకు నిధుల కేటాయింపు వల్ల జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడి అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

రెండు సెషన్లతో కలెక్టర్లతో సమావేశం.. 

 కలెక్టర్​ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో సోమవారం సీఎస్ కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎంతోపాటు మంత్రులందరూ పాల్గొని కలెక్టర్లతో ముఖాముఖి చర్చించే ఈ కాన్ఫరెన్స్ అజెండాపై భేటీలో సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు స్పష్టంగా వివరించేందుకు వీలుగా అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధం కావాలని సీఎస్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు.

కలెక్టర్ల సదస్సులో ఉదయం, మధ్యాహ్నం సెషన్ల వారీగా కీలక అంశాలపై మేధోమధనం జరగనుంది. ఉదయం సెషన్‌‌‌‌‌‌‌‌లో జాతీయ స్థాయిలో చేపట్టనున్న ‘జనగణన’ (సెన్సస్) ప్రక్రియపై కలెక్టర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా, పారదర్శకంగా, నిర్ణీత సమయంలోగా జనగణన పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చేయాల్సిన కసరత్తును వివరించనున్నారు.

ఇక మధ్యాహ్నం సెషన్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘99 డేస్ యాక్షన్ ప్లాన్’పై కలెక్టర్లకు సుదీర్ఘంగా దిశానిర్దేశం చేయనున్నారు. అభివృద్ధి పనుల వేగవంతం, కీలక ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ శాఖ అనుమతుల సాధన తదితర అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.  ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఏర్పాట్లపైనా సన్నాహక భేటీలో విస్తృతంగా చర్చించారు.