- బీఆర్ఎస్1,157..బీజేపీ 256..ఇతరులు 481
- అత్యధిక గ్రామాల్లో సర్పంచులుగా అధికార పార్టీ మద్దతుదారుల విజయం
- ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
- ఈ విడతలో 3,911 సర్పంచ్, 29,917 వార్డులకు ఎన్నికలు
- 415 పంచాయతీలుఏకగ్రీవం
- 3,892 సర్పంచ్..29,853 వార్డు స్థానాల్లో ఓట్ల లెక్కింపు..
- రాష్ట్రవ్యాప్తంగా 3,911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
హైదరాబాద్, వెలుగు: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగింది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆపార్టీ.. రెండో విడతలోనూ విజయపరంపర కొనసాగించింది.
అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. ఈ విడతలో మొత్తం 4,331 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల రెండు పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డుమెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగగా.. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 4,331 గ్రామ పంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 2,316 స్థానాలను కైవసం చేసుకొని..తన ఆధిపత్యాన్ని చాటుకున్నది.
బీఆర్ఎస్ పార్టీ 1,157 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 256, ఇతరులు 481(ఇందులో సీపీఐ, సీపీఎం ఉన్నాయి) స్థానాలు సాధించారు. కాగా, జగిత్యాల జిల్లాలో మొత్తం 144 స్థానాలు ఉండగా.. అత్యధికంగా కాంగ్రెస్ 103 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ కేవలం 15 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలో ఆ పార్టీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. అక్కడ ఉన్న 282 స్థానాల్లో 172 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 65 సీట్లతోనే సరిపెట్టుకున్నది.
నిజామాబాద్ (136), సంగారెడ్డి (147), కామారెడ్డి (138) జిల్లాల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నామమాత్రంగా మిగిలింది.
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకున్నది. ఇక్కడ మొత్తం 182 స్థానాలకుగానూ ఆ పార్టీ 113 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ 38 స్థానాల్లో విజయం సాధించింది. నిర్మల్ జిల్లాలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. మొత్తం 50 చోట్ల ఆ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు.
ఆదిలాబాద్‌లోనూ బీజేపీ 47 స్థానాలు సాధించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగులాంటి జిల్లాల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేడర్ చేజారిపోవడం, అధికార పార్టీ వైపు మొగ్గు చూపడంలాంటి పరిణామాలతో బీఆర్ఎస్ డీలా పడింది. ఈ పల్లె తీర్పుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు కాగా.. బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది.
సమన్వయంతో కాంగ్రెస్ విజయం..
మొదటి విడతలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా ఈసారి పకడ్బందీగా క్యాంపెయిన్ చేయడంతో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను దక్కించుకున్నది. క్షేత్రస్థాయి కేడర్ సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడంలో సక్సెస్ అయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నది. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన పంచాయతీ ఎన్ని కల్లో అధికారపార్టీ విజయానికి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే బాటలు వేశాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లులాంటి ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌కు కలిసొచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్‌జర్నీ, వ్యాపారాలుగా తీర్చిదిద్దుతున్న కాంగ్రెస్ సర్కారువైపు మహిళలు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతున్నదని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడం వల్లే పార్టీకి ఈ స్థాయి విజయం దక్కిందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగియడంతో ఫలితాల కోలాహలం మొదలైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టిన అధికారులు ఫలితాలను వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక (ఫేజ్-2) ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో మొత్తం 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రాత్రి 10.30 గంటల వరకు 3,892 స్థానాల్లో ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. అలాగే, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరగ్గా, అందులో 29,853 స్థానాలకు ఫలితాలు డిక్లేర్ చేశారు. మిగిలిన స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.
