ఖమ్మం జిల్లాలో విషాదం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాడే సర్పంచ్ అభ్యర్థి మృతి

ఖమ్మం జిల్లాలో విషాదం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాడే  సర్పంచ్ అభ్యర్థి మృతి

హైదరాబాద్: రెండో విడత పంచాతీయ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ నాడే అనారోగ్యంతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగారం గ్రామంలో సర్పంచ్ స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న నాగరాజు శనివారం (డిసెంబర్ 13) సాయంత్రం ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. 

కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‎లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆదివారం (డిసెంబర్ 14) తెల్లవారుజూమున నాగరాజు మృతి చెందాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేసిన నాగరాజు సరిగ్గా పోలింగ్ రోజే కన్నుమూయడంతో అనాసాగారం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

 రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. 193 మండలాల్లోని 3 వేల 911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 38 వేల 350 పోలింగ్ ​కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. 

కొన్నింటిని మోడల్​ పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్​ ప్రక్రియను చేపట్టి.. విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.