Messi's GOAT Tour: ఒకే చోట దిగ్గజాలు: మెస్సీకి సచిన్ నంబర్ 10 జెర్సీ.. ప్రతిగా ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చిన అర్జెంటీనా గోట్

Messi's GOAT Tour: ఒకే చోట దిగ్గజాలు: మెస్సీకి సచిన్ నంబర్ 10 జెర్సీ.. ప్రతిగా ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చిన అర్జెంటీనా గోట్

లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ లో భాగంగా ముంబై నగరాన్ని చేరుకొని వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆదివారం (డిసెంబర్ 14) తన రెండో రోజు టూర్ లో భాగంగా ముంబైలో మెస్సీ అనేక మంది ప్రముఖులను కలిశాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ను మెస్సీ కలుసుకోవడం హైలెట్ గా మారింది. వాంఖడే స్టేడియంలో వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలో సచిన్ తన 10వ నెంబర్ జెర్సీని మెస్సీకి గిఫ్ట్ గా ఇచ్చాడు. అదే సమయంలో మెస్సీ.. సచిన్ కు వరల్డ్ కప్ బాల్ ను గిఫ్ట్ గా ఇవ్వడం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా మారింది. 

ఈ కార్యక్రమంలో సచిన్‌ను మెస్సీ గురించి మాట్లాడమని కూడా కోరారు. సచిన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. "నేను ఇక్కడ కొన్ని అద్భుతమైన క్షణాలు గడిపాను. మనం ముంబైని కలల నగరం అని పిలుస్తాము. ఈ వేదికపై అనేక కలలు ముగింపు రేఖను చూశాను. మీ సపోర్ట్ కారణంగానే 2011లో ఈ మైదానంలో గోల్డెన్ మూమెంట్స్ ను చూశాము". అని టెండూల్కర్ ఇండియా వన్డే వరల్డ్ కప్ విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. 

మెస్సీ గురించి మాట్లాడుతూ, "లియో విషయానికి వస్తే.. అతని ఆట గురించి నేను మాట్లాడాల్సి వస్తే..అతను ప్రతిదీ సాధించాడు. మెస్సీ అంకితభావం, సంకల్పం, నిబద్ధత నాకు చాలా బాగా నచ్చుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన వినయం, ఆయన వ్యక్తిత్వం అద్భుతం. మెస్సీ, అతని ఫ్యామిలీ బాగుండాలని ఇండియన్ ఫ్యాన్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడకు వచ్చి యువతను ప్రోత్సహించినందుకు మరోసారి ధన్యవాదాలు. అని సచిన్ చెప్పుకొచ్చాడు. 

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ , భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి వంటి వారు ఈ వేదిక వద్ద హాజరై ఫ్యాన్స్ కు ఖుషీ చేశారు.