గురుకులాలన్నీ ఒకే చోటుకి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒక దగ్గరకు చేర్చడంపై ప్రభుత్వం ఫోకస్

గురుకులాలన్నీ ఒకే చోటుకి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒక దగ్గరకు చేర్చడంపై ప్రభుత్వం ఫోకస్
  • దశల వారీగా అమలుకు నిర్ణయం
  • ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో విలీనం చేసేలా ప్రతిపాదనలు
  • ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ స్కూల్
  • భవిష్యత్​లో మరిన్ని ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురుకులాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటి వరకు వేర్వేరు సామాజిక వర్గాలకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ (సమగ్ర గురుకుల పాఠశాల)ను ఏర్పాటు చేస్తోంది.

 కులాలవారీగా విద్యార్థులను వేరుచేసి చదివించడం వల్ల సమాజంలో అంతరాలు ఏర్పడుతున్నాయని, వాటిని రూపుమాపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికే భవనాలకు శంకుస్థాపన చేయగా, రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా వీటిని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

మొదటి విడతలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఫలితాలను అనుసరించి విస్తరించనున్నారు. ఇప్పటికే రెండు దశల్లో 78 నియోజకవర్గాల్లో గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి రూ.15,600 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న గురుకులాల్లో ఏయే వాటిని విలీనం చేయాలి? విద్యార్థుల తరలింపు ప్రక్రియ ఎలా ఉండాలి? సిబ్బంది సర్దుబాటు ఎలా? అనే అంశాలపై విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందుబాటులోకి తేవాలన్నది సర్కారు లక్ష్యం.

అంతరాలకు చెక్​.. సమస్యలకు పరిష్కారం

ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ సొసైటీల పరిధిలో దాదాపు 1,025కి పైగా గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అయితే, ఇందులో మెజారిటీ పాఠశాలలు అంటే.. దాదాపు 600కు పైగా గురుకులాలు ఇన్నాళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 

ఇవి నివాస గృహాలు లేదా చిన్నపాటి అపార్ట్‌‌మెంట్లు కావడంతో విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఉండటం లేదు. సరైన వెలుతురు లేని గదులు, ఆటస్థలాలు లేకపోవడం, ఒకే గదిలో పరిమితికి మించి విద్యార్థులు ఉండాల్సి రావడం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ అద్దె భవనాల కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నప్పటికీ, నాణ్యమైన వసతులు మాత్రం విద్యార్థులకు అందడం లేదు. 

ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగానే ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కొత్తగా నిర్మించబోయే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌‌ను దాదాపు 25 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిర్మించనున్నారు. ప్రస్తుతం చిన్నచిన్న అద్దె భవనాల్లో నడుస్తున్న 3 లేదా 4 గురుకులాలను (ఉదాహరణకు ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ బాలుర/బాలికల స్కూల్) కలిపి ఈ భారీ క్యాంపస్‌‌లోకి మారుస్తారు. తద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యవేక్షణ కూడా సులభతరం అవుతుందని అధికారుల అంచనా.

పెరగనున్న సీట్లు.. మిగలనున్న నిధులు

ఇక విద్యార్థుల అడ్మిషన్ల విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న గురుకులాల్లో ఒక్కో తరగతికి పరిమిత సంఖ్యలో (సుమారు 40 నుంచి 80 మంది వరకు) మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ తరగతి గదుల కొరత, వసతి లేమితో చాలామందికి సీట్లు దొరకడం లేదు. అయితే కొత్తగా వచ్చే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌‌లో ఏకంగా 2 వేల నుంచి 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా మౌలిక వసతులు కల్పించనున్నారు. 

అంటే మూడు, నాలుగు స్కూళ్లు కలిపి ఒకే చోట ఉన్నా, విద్యార్థుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా డిజైన్ చేస్తున్నారు. ఆధునిక డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, విశాలమైన గ్రౌండ్స్ ఇందులో ఉండటం వల్ల ఎక్కువ మంది పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం కేవలం భవనాల మార్పు మాత్రమే కాదని, సామాజిక మార్పు కూడా అని సీఎం పలుమార్లు ప్రస్తావించారు.

 చిన్నప్పటి నుంచే పిల్లల మధ్య కుల, మత బేధాలు లేకుండా అందరూ కలిసి చదువుకోవడం, కలిసి భోజనం చేయడం వల్ల సమానత్వ భావన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం వేర్వేరు సొసైటీల కింద నడుస్తున్న గురుకులాలను ఒకే తాటిపైకి తేవడం ద్వారా.. ఉపాధ్యాయుల సర్దుబాటు, నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. అంతేకాకుండా, అద్దె భవనాల కోసం ఖర్చు చేస్తున్న ప్రజాధనం ఆదా అవుతుందని, ఆ నిధులను విద్యార్థులకు సౌకర్యాల మెరుగుదలకు వినియోగించవచ్చని ప్రభుత్వం యోచిస్తున్నది.