మనదేశంలో చలికాలం వస్తే కొంతమంది ఎంజాయ్ చేస్తారు. కానీ చలిదేశాల్లో ఉండేవాళ్లకే తెలుసు ఆ వాతావరణంలో బతకడం ఎంత కష్టమో! అలాగే మనదగ్గర వేడి ఎక్కువ కాబట్టి సమ్మర్లో చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే, సమ్మర్లో వడదెబ్బలా వింటర్ స్ట్రోక్‌లు చాలా చూస్తుంటారు అక్కడివాళ్లు. నిజానికి చలిదేశాలే కాదు.. చలికాలంలో ఏ దేశంలో అయినా వింటర్ స్ట్రోక్‌లు ప్రమాదమే. అవి రకరకాలుగా ఆరోగ్యం మీద దెబ్బకొడతాయని, చావు అంచులదాకా తీసుకెళ్తాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్.
అసలు ఏంటీ వింటర్ స్ట్రోక్‌లు?
శీతాకాలం అంటే చాలామందికి ఇష్టం. చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, స్కార్ఫ్‌లు, మఫ్లర్లు చుట్టుకుని వేడి వేడి కాఫీలు తాగుతూ.. టిఫిన్లు చేస్తుంటే ఆ మజానే వేరు. ఉదయాన్నే కురిసే మంచు చూసి ఎక్కడో చలిదేశంలో ఉన్నట్టు ఫీలయ్యి ఫొటోలు దిగేస్తుంటాం. అదంతా బాగానే ఉంది.. కానీ, వింటర్లో ఫుడ్, స్కిన్‌కేర్ గురించి తీసుకున్నంత శ్రద్ధ అసలైన ఆరోగ్యం మీద చూపించట్లేదనేది డాక్టర్ల మాట.
అసలైన ఆరోగ్యమంటే మరేదో కాదు.. మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తూ, ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండడమే. మరీ ముఖ్యంగా వింటర్లో గుండె, మెదడును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటున్నారు డాక్టర్లు.
ఎందుకంటే.. వింటర్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు పెరిగే చాన్స్ ఉంది. అయితే, వీటితోపాటు బ్రెయిన్ స్ట్రోక్‌లు కూడా పెరుగుతున్నాయని గుర్తించారు ఎక్స్పర్ట్స్. అందుకే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లను ఈ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్.
వింటర్ ఎయిర్ పొల్యూషన్ కూడా పెద్ద సమస్యే. సిటీల్లో బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే కాకుండా ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
డీవీటీ కేసులు ఎక్కువ: లోపలి సిరల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని డీప్ వీనస్ థ్రోంబోసిస్ అంటారు. ఇది సాధారణంగా కాళ్లలో జరుగుతుంది. వింటర్లో డీవీటీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఒక స్టడీలో తేలింది. ఇది కేవలం కోల్డ్ ఎయిర్ ప్రెజర్ వల్ల మాత్రమే కాదు బలమైన గాలులు వీచేటప్పుడు, హెవీ రెయిన్స్ పడినప్పుడు కూడా ఇలా జరుగుతుంటుంది.
ఈ చల్లటి వాతావరణంలో ఎక్కువగా కదలరు కాబట్టి కాళ్లలో రక్తసరఫరా సరిగా జరగదు. దాంతో గడ్డకట్టిన రక్తాన్ని విచ్ఛిన్నం చేసే సామర్థ్యం శరీరం కోల్పోతుంది. ఈ సీజన్లో వీనస్ థ్రోంబోఎంబోలిజమ్ కండిషన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. వింటర్లో14 శాతం రిస్క్ పెరుగుతుందని ఒక స్టడీలో తెలిసింది.
హార్ట్ స్ట్రోక్ : ఇవి వింటర్లో ఎక్కువగా వస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టడీల్లో తేలింది. సీజన్‌తో పనిలేకుండా వేడిగా ఉండే నెలల్లో కూడా 39 శాతం స్ట్రోక్స్ వస్తుంటాయి. ఇక హైపర్ టెన్షన్‌కి సీజన్స్‌తో పనిలేదు. రీసెర్చ్ ప్రకారం సిస్టోలిక్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెజర్స్ వింటర్లో పెరుగుతాయి. సమ్మర్లో తగ్గుతాయి. ఎందుకంటే చల్లని వెదర్లో ఫిజికల్ యాక్టివిటీ, విటమిన్ డి తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి.
అంతేకాదు.. కోల్డ్ వెదర్లో రక్తనాళాలు సంకోచించి బిగుతుగా అవ్వడం వల్ల గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కొన్నిసార్లు లంగ్స్‌లో ఫ్లూయిడ్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. దీర్ఘకాలికంగా గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎక్సర్సైజ్ చేయడానికి కష్టమవుతుంది.
నాన్ ట్రామాటిక్ ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ : బ్రెయిన్లో ఎలాంటి గాయం లేకపోయినా బ్లీడింగ్ అవుతుంది. బ్లడ్ ప్రెజర్ వింటర్లో పెరుగుతూనే ఉంటుంది. బంగ్లాదేశ్, జపాన్, బ్రిటన్, రొమేనియా, పోర్చుగల్ వంటి కొన్ని దేశాల్లో వింటర్లో ఎక్కువ కేసులు వస్తున్నట్టు తెలిసింది.
ఏట్రియల్ ఫైబ్రిలేషన్ : ఇర్రెగ్యులర్ హార్ట్‌బీట్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్నే ఏట్రియల్ ఫైబ్రిలేషన్ అంటారు. ఈ కండిషన్ ముఖ్యంగా జపాన్, ఫిన్లాండ్, పోలాండ్, ఇజ్రాయెల్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గుర్తించారు. టెంపరేచర్ తక్కువగా ఉండి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, బలమైన గాలులు వీచేటప్పుడు ఈ కండిషన్‌ని చూడొచ్చు. వయసుమళ్లినవాళ్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, హైబీపీ ఉన్నవాళ్లలో కనిపిస్తుంటుంది.
రిస్క్ ఎవరికి?
ఫ్లూ, నిమోనియా వంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ రక్తనాళాల్లో వాపుకు కారణమవుతాయి. దాంతో రిస్క్ పెరుగుతుంది. ఎవరికైనా కార్డియోవాస్క్యూలార్ డిసీజెస్, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ వంటివి ఉంటే వాళ్లు ఆల్రెడీ రిస్క్‌లో ఉన్నట్లే. ఎక్సర్సైజ్ చేయకపోవడం, హైడ్రేషన్ తగ్గడం, ఇంట్లోనే అధిక పొల్యూషన్‌కి గురికావడం వల్ల రిస్క్ మరింత పెరుగుతుంది.
ఇస్కెమిక్ స్ట్రోక్: వాతావరణంలోని టెంపరేచర్లు పడిపోతే శారీరకంగా చాలా మార్పులకు దారితీస్తాయి. వాటిలో ముఖ్యంగా స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా కాకుండా అంతరాయం కలుగుతుంది. మెదడు కణజాలానికి ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ అందవు. దాంతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం మొదలవుతుంది.
వింటర్ డీహైడ్రేషన్ : వింటర్లో డీహైడ్రేషన్ గురించి చాలామంది పట్టించుకోరు. కానీ, ఇది చాలా డేంజర్. కాస్త డిహైడ్రేట్ అయినా రక్తం చిక్కబడుతుంది. కాబట్టి రక్తం గడ్డకట్టే అవకాశాలు చాలా ఎక్కువ.
వెంట్రిక్యులార్ అర్రిథ్మియాస్ : అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ వల్ల వచ్చే కండిషన్ ఇది. మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ ఈ కండిషన్ కనిపిస్తుంది. కోల్డ్ వెదర్లో ఈ రిస్క్ పెరుగుతుంది.
యాంజినా పెక్టోరిస్ : ఇది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే ఛాతీ నొప్పి. ఇటలీ, రష్యా ప్రజలు ఎక్కువగా వింటర్లో ఈ కండిషన్‌ని ఎదుర్కొంటున్నారు.
గుర్తిస్తే.. గోల్డెన్ అవర్‌లో కాపాడొచ్చు!
స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే గోల్డెన్ అవర్ అంటే గంటలో ట్రీట్‌మెంట్ అందాలి. దీంతో బ్రెయిన్‌ని కాపాడి, దీర్ఘకాలిక డిజేబిలిటీని నివారించొచ్చు. మరీ ముఖ్యంగా 60 ఏండ్ల తర్వాత యాక్టివ్‌గా ఉండడం, హెల్దీగా తినడం, స్మోకింగ్ మానేయడం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం తప్పనిసరి. ‘‘నిజానికి అవేర్నెస్ ఉండి టైంకి ట్రీట్‌మెంట్ అందితే 80 శాతం స్ట్రోక్స్‌ని నివారించొచ్చు.
స్ట్రోక్ నివారించడానికైనా, పర్మినెంట్‌గా డిజేబిలిటీ రావడానికైనా కొన్ని నిమిషాల టైం నిర్ణయిస్తుంది. కాబట్టి త్వరగా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. నివారణ అనేది అవేర్నెస్ వల్లే మొదలవుతుంది’’ అన్నారు స్ట్రోక్ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్, ఐఎస్ఎ సెక్రటరీ డాక్టర్ అరవింద్ శర్మ. లక్షణాలను BEFAST అంటారు.
- బి - బ్యాలెన్స్ లాస్ అవ్వడం (Balance loss)
- ఈ - ఐ విజన్‌లో మార్పులు (Eye vision changes)
- ఎఫ్ - ఫేస్ వంకరపోవడం (Face drooping)
- ఎ - చేతుల బలహీనత (Arm weakness)
- ఎస్ - మాటల్లో తడబాటు (Speech difficulty)
- టి - టైం టు యాక్ట్ ఫాస్ట్ (Time to act fast)
అవేర్నెస్ వల్లే ప్రివెన్షన్
న్యూరో ఇమేజింగ్‌లో సీటీ, ఎంఆర్ఐ స్కాన్లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్లు స్ట్రోక్ ఏ ప్రదేశంలో వచ్చిందో వెంటనే గుర్తిస్తున్నారు. వేగంగా మంచి ట్రీట్మెంట్ను అందిస్తున్నారు. ఇస్కెమిక్ స్ట్రోక్‌లలో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించేందుకు ట్రీట్‌మెంట్ ఇస్తారు. కొన్ని గంటల్లోనే అది ఫలితం చూపిస్తుంది. ఎండోవాస్క్యూలార్ థెరపీలో క్లాట్‌ని ఫిజికల్‌గానే రిమూవ్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్లు నాలుగున్నర గంటల్లో అందిస్తే పూర్తిగా రికవరీ అయ్యే చాన్స్ ఉంది. స్ట్రోక్‌ని నివారించడం అవేర్నెస్, రొటీన్ చెకప్స్ వల్లనే సాధ్యమవుతుంది. బాడీ టెంపరేచర్ తగ్గకుండా ఉండేలా బట్టలు ధరించడం కూడా చాలా ఇంపార్టెంట్. ‘‘ఈ వింటర్లో 30-65 ఏండ్ల లోపు వాళ్లలో స్ట్రోక్ కేసులు పది శాతం ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నా, మాట్లాడడంలో తడబాటు ఉన్నా వాళ్లు వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకోవాలి’’ అంటున్నారు ముంబైకి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుట్టీ.
–వెలుగు, లైఫ్–
