- రాహుల్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మాట్లాడిన ఒక్కో కాంగ్రెస్ పార్టీ నాయకుడు.. రామాయణంలో విలన్ కు ఉన్న ఒక్కో తలను తలపించేలా ప్రవర్తించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 100 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా రాహుల్ గాంధీ నాయకుడు ఎలా అవుతారని ‘ఎక్స్’ వేదికగా ఆయన నిలదీశారు. ఆదివారం కాంగ్రెస్ తలపెట్టిన ఓట్ చోరీ మహార్యాలీ తర్వాత కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ర్యాలీ పూర్తిగా విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ ఆరోపణలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ‘‘ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాంగ్రెస్ ప్రశ్నలకు పార్లమెంటులో బీజేపీ సమర్థంగా సమాధానం చెబితే భయపడి పారిపోయారు. కాంగ్రెస్ వితండవాదాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాహుల్ ‘ఓట్ చోరీ’ పేరిట దుష్ర్పచారం చేస్తున్నరు.
ఆ విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యింది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ దేశానికి చేస్తున్న ద్రోహాన్ని కప్పిపుచ్చడానికే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీ కార్యకర్తలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.మరోవైపు ప్రియాంక గాంధీ కామెంట్లను కూడా ఆయన ఖండించారు. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల కమిషనర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఉన్నాయన్నారు.
