బీసీలకు 30% : మున్సిపోల్స్​ కోసం డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు

బీసీలకు 30% : మున్సిపోల్స్​ కోసం డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లు

మున్సిపోల్స్​ కోసం డివిజన్లు, వార్డుల రిజర్వేషన్ల సంఖ్య ఖరారు
ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5.5 శాతం కేటాయింపు
జనరల్‌కు కోటా కన్నా 17 వార్డులు అదనం
డోర్నకల్‌, మరిపెడల్లో బీసీలకు జీరో రిజర్వేషన్‌
నేడు మేయర్లు, చైర్మన్​ పదవులకు రిజర్వేషన్లు
ఏ డివిజన్/వార్డుకు ఏ రిజర్వేషన్​ వస్తుందన్నది తేల్చేదీ నేడే
ఉదయం 11.30కు ఆల్‌ పార్టీ మీటింగ్‌

హైదరాబాద్‌, వెలుగుమున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లు, వార్డులకు రిజర్వేషన్ల కోటా ఖరారైంది. ఏ రిజర్వేషన్​ కేటగిరీ కింద ఎన్ని డివిజన్లు, వార్డులు ఉంటాయన్న లెక్కలను మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ అధికారులు శనివారం ప్రకటించారు. 10 కార్పొరేషన్ల పరిధిలోని 385 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు కలిపి మొత్తంగా 3,112 సీట్లున్నాయి. వీటిల్లో బీసీలకు 30 శాతం దక్కుతుండగా, ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5.5 శాతం దక్కనున్నాయి. జనరల్‌  కేటగిరీకి దక్కాల్సిన సంఖ్య కన్నా 17 వార్డులు అదనంగా ఇచ్చారు. ఇక ఏయే డివిజన్/వార్డుకు ఏ రిజర్వేషన్​ ఉంటుందన్న వివరాలను, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లను ఆదివారం ప్రకటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీడీఎంఏ ఆఫీస్‌లో నిర్వహించే ఆల్‌ పార్టీ మీటింగ్‌లో మొదట రిజర్వేషన్లను విడుదల చేస్తారు. తర్వాత కేటగిరీల వారీగా మహిళా కోటా తేల్చేందుకు డ్రా తీయనున్నారు.

రాష్ట్రంలో కరీంనగర్‌‌, రామగుండం, నిజామాబాద్‌‌, బడంగ్‌‌పేట్‌‌, మీర్‌‌పేట్‌‌, బండ్లగూడ జాగీర్‌‌, బోడుప్పల్‌‌, ఫీర్జాదిగూడ, జవహర్‌‌నగర్‌‌, నిజాంపేట కార్పొరేషన్లతో పాటు 120 మున్సిపాలిటీల్లో ఎలక్షన్లు నిర్వహించేందుకు డిసెంబర్‌‌ 23న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 7న ఎస్‌‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ ఇవ్వనుండగా, 8 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న పోలింగ్‌‌, 25న కౌంటింగ్‌‌ చేపడతారు. ఈ మేరకు ఎలక్షన్​ కమిషన్, మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్షన్​ అధికారుల సూచన మేరకు మున్సిపల్‌‌ కమిషనర్లు శనివారం ఫైనల్‌‌ ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ను పబ్లిష్‌‌ చేయగా.. అదే టైంలో మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అధికారులు కేటగిరీల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను ప్రకటించారు.

మొత్తం రిజర్వేషన్లు 49.5 శాతం

మున్సిపల్‌‌ డివిజన్లు, వార్డుల కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 49.5 శాతం రిజర్వ్‌‌ చేశారు. ఎస్టీలకు 171 వార్డులు, డివిజన్లు కేటాయించగా అందులో 28 మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 435 వార్డులు, డివిజన్లు దక్కగా అందులో మహిళలకు 184 దక్కాయి. బీసీలకు 933 వార్డులు, డివిజన్లు రిజర్వ్‌‌ చేయగా 440 మహిళలకు దక్కాయి. జనరల్‌‌ కింద 676 వార్డులు, డివిజన్లు రాగా.. అన్‌‌ రిజర్వుడ్‌‌ కేటగిరీలో మహిళలకు అత్యధికంగా 897 సీట్లు దక్కాయి. మొత్తం 3,112 వార్డుల్లో జనరల్‌‌కు 1,556 వార్డులు (50శాతం) దక్కాల్సి ఉండగా.. 17 వార్డులు అదనంగా కేటాయించారు. మొత్తంగా మహిళలకు 50 శాతం సీట్లు రావాల్సి ఉంటే ఆరు వార్డులు తగ్గాయి. రిజర్వేషన్ల కేటాయింపుపై మున్సిపల్‌‌ అధికారులను సంప్రదించగా.. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేటాయింపులు చేశామన్నారు. స్టేట్‌‌ యూనిట్‌‌గా రిజర్వేషన్లు ఖరారు చేశామని, మొత్తంగా 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లను పరిగణనలోకి తీసుకున్నాకే.. కేటగిరీల వారీ రిజర్వేషన్ల సంఖ్య నిర్ణయించామని తెలిపారు.

రెండు మున్సిపాలిటీల్లో బీసీలకు సీట్లు లేవు

మహబూబాబాద్‌‌ జిల్లా డోర్నకల్‌‌, మరిపెడ మున్సిపాలిటీల్లో బీసీలకు ఒక్కటంటే ఒక్క వార్డు కూడా దక్కలేదు. డోర్నకల్‌‌లో 15 వార్డులుండగా.. 4 వార్డులు ఎస్టీలకు, 3 వార్డులు ఎస్సీలకు కేటాయించారు. మిగతా 8 జనరల్‌‌ కేటగిరీకి దక్కాయి. మరిపెడ మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో ఆరు ఎస్టీలకు, ఒకటి ఎస్సీలకు, ఎనిమిది జనరల్‌‌కు కేటాయించారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో 50 శాతం రిజర్వేషన్లకు సరిపడా ఎస్సీ, ఎస్టీల జనాభా ఉండటంతో బీసీలకు రిజర్వేషన్​ రాలేదు.చాలా మున్సిపాలిటీల్లో ఎస్టీల జనాభా 1 శాతం లోపే ఉన్నా ఒక్కో వార్డు/డివిజన్‌‌ కేటాయించారు.

వరంగల్‌‌ రూరల్‌‌ జిల్లా వర్ధన్నపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌‌ మున్సిపాలిటీల్లో బీసీలకు ఒక్కో వార్డు వచ్చాయి. భూత్పూర్‌‌, వడ్డేపల్లె, ఆలంపూర్‌‌, పెబ్బేరు, అమరచింత మున్సిపాలిటీల్లో రెండు చొప్పున కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు చేసేముందు బీసీలకు 33 శాతం వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఎస్సీల జనాభా 2 శాతం అదనంగా పెరగడం, కొన్నిచోట్ల బీసీలకు తక్కువ వార్డులు దక్కడంతో.. 30 శాతానికి తగ్గినట్టు చెప్తున్నారు.