వాటర్​ ట్యాంకెక్కిన ఆశ్రమ హాస్టల్​ వర్కర్లు

వాటర్​ ట్యాంకెక్కిన ఆశ్రమ హాస్టల్​ వర్కర్లు
  • 63 రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకుంటలేరనే.. 
  • నెల జీతం, సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్​  
  • సర్ధి చెప్పి దింపిన మహదేవపూర్ ​తహసీల్దార్​

మహదేవపూర్, వెలుగు: ‘పనిజేసిన పైసలు నెలనెల టైంకు ఇస్తూ..సమాన పనికి సమాన జీతం ఇయ్యాలె అని 63 రోజులుగా నిరసన తెలియజేస్తుంటే సర్కారు పట్టించుకుంట లేదు’ అని ఆశ్రమ హాస్టళ్లలో వంట చేసే డెయిలీ వేజ్​వర్కర్లు వాటర్ ట్యాంక్ ఎక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లోని వివిధ హాస్టళ్లలో వంట చేసే డెయిలీ వేజ్​వర్కర్లు రెండు నెలలుగా నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం నలుగురు వర్కర్లు మహదేవపూర్ లోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు. దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో ఎస్ఐ రాజ్ కుమార్, తహసీల్దార్​శ్రీనివాస్ అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పి కిందికి దింపారు. 

వర్కర్లు మాట్లాడుతూ ‘మేమేం అడిగినం సారూ.. చేసిన పనికి తగ్గ జీతం అడిగినం, ఇప్పుడిచ్చె జీతాన్ని యే నెలకా నెల ఇవ్వమన్నం. ఎప్పుడో లాక్ డౌన్ ల ఇయ్యాల్సిన ఎనిమిది నెలల పైసలు ఇప్పటికీ ఇస్తలేరు. రెండు నెలల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకుంటలేరు. తెలంగాణా సర్కార్ల మా పానాలకు విలువ లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.