- ఢిల్లీల మోదీ, ఫామ్‌హౌస్‌ల కేసీఆర్ !
- గల్లీల్లో సమస్యలు తీర్చేటోళ్లకే ఓటేయండి : సీఎం రేవంత్
- కాంగ్రెస్‌ను గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే
- కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్‌రెడ్డి, బండికి లేదు
- రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికి వాళ్ల రికమండేషన్లు ఎందుకు?
- హైదరాబాద్, ఖమ్మంలో వరదలు వస్తే పైసా ఇప్పించలే
- తెలంగాణలో అన్ని సమస్యలకూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనే కారణం
- మళ్లీ ఏ మొఖం పెట్టుకొని కేటీఆర్, హరీశ్ ఓట్లడుగుతున్నరు?
- ఇక్కడ బీఆర్‌ఎస్ మొక్కను ఇక మొలవనివ్వద్దు
- బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కామెంట్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే ఎలాంటి లాభం లేదని, ఈ రెండు పార్టీల్లో నేతలెవరూ పైసా తెచ్చి మున్సిపాలిటీల్లో పెట్టే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘మోదీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు, కేసీఆర్‌ను చూసి ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నరు.. వీళ్లను చూసి ఓట్లేస్తే గెలిచినవాళ్లు నిధులు ఎక్కడి నుంచి తెస్తరు? గల్లీల్లో మోరీ తీయాలంటే ఢిల్లీ నుంచి మోదీ వస్తడా? ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ వస్తడా? మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే, మంత్రితో మాట్లాడి నిధులు తెచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయి’’ అని స్పష్టంచేశారు. మరో 8 ఏండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యతను ఆ శాఖ మంత్రిగా తాను తీసుకుంటానని చెప్పారు. అందువల్ల అభివృద్ధికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం చిట్ చాట్ చేశారు. తాను స్వయంగా మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నందున రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ఎన్నికలు ప్రధానంగా మూడు పార్టీల మధ్య జరుగుతున్నాయని, ఓటర్లు విజ్ఞతతో ఓటువేయాలని కోరారు.
‘‘ఎన్నికల్లో ఓటు వేసేందుకు మరో 24 గంటల సమయం ఉంది.. ప్రశాంతంగా ఆలోచించండి.. 12 ఏండ్ల మోదీ పాలనకా? పదేండ్ల బీఆర్ఎస్ పాలనకా? రెండేండ్ల కాంగ్రెస్ పాలనకా? ఏ పార్టీకి ఓటు వేయాలనేది నిర్ణయించుకోండి. విజ్ఞతతో ఓటు వేయండి’’ అని ఓటర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో తీర్పు ఇవ్వబోతున్న పట్టణ ప్రాంత ప్రజలు గతం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీర్పు ఇవ్వాలన్నారు.
హక్కుగా వచ్చే నిధులకు మీ రికమెండేషన్ ఎందుకు?
కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డికి, బండి సంజమ్‌కి లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చేవి రాష్ట్రాలకు హక్కుగా, రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులేనని, వాటికి వాళ్ల రెకమండేషన్లు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయిలో రాష్ట్రానికి తిరిగి వెనక్కి వచ్చేది కేవలం 42 పైసలు మాత్రమేనని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై మోదీని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిలదీయగలరా? ఏనాడైనా మోదీనిగానీ, కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, నీతి ఆయోగ్‌ను గానీ అడిగారా? ’’అని సీఎం నిలదీశారు. వీరిద్దరు కలిసి రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదని విమర్శించారు.
హైదరాబాద్, ఖమ్మం నీటమునిగితే పైసా తేలే!
ఓట్లేస్తే కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు నిధులు తెస్తామని ఇద్దరు కేంద్రమంత్రులు చెప్తున్నారని, కానీ వాళ్లను ఎలా నమ్ముతామని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘‘గతంలో హైదరాబాద్, ఖమ్మం నగరాలు నీట మునిగాయి. నీటమునిగిన వస్తువులన్నింటినీ తిరిగి ఇస్తామని, బైకులకు బైకులు, ఆటోలకు ఆటోలు, కార్లకు కార్లు కొత్తవి ఇప్పిస్తామని, ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తెప్పించి ఇస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ హామీ ఇచ్చారు. బండి సంజయ్ మాటలు నమ్మి జీహెచ్‌ఎంసీలో 50 మంది బీజేపీ కార్పొరేటర్లను గెలిపించారు.
కానీ ఎన్నికలయ్యాక అడిగితే ఆ బండ్లకు బీమా ఉంటుంది కదా క్లెయిమ్ చేసుకోవాలంటూ బండి సంజయ్ మాటమార్చారు. బీమా డబ్బులకు బండి సంజయ్ రికమెండేషన్ ఎందుకు? ఆయన మాటలు సత్రం భోజనానికి పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నట్లుగా ఉంది’’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లకు మత విద్వేషాలు రెచ్చగొట్టి, ఓట్లు అడుక్కోవడం అలవాటుగా మారిందన్నారు.
‘‘ఆ పార్టీ నేతలు రాముడి పేరు చెబుతారు కానీ.. వాళ్లు దండం పెట్టుకునేది మాత్రం అసదుద్దీన్ ఒవైసీకే.. ఆయన పేరు లేకుండా బీజేపీ నేతల ప్రచారం ఉండదు.. రాముడి పేరు ఎన్నిసార్లు తలుచుకుంటారో అసదుద్దీన్ పేరు అన్నిసార్లు తలుచుకుంటారు.. అసదుద్దీన్‌ను అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతుంటారు.. మీరు చెప్పినట్లు అసదుద్దీన్ దుర్మార్గుడైతే కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉందికదా, చర్యలు ఎందుకు తీసుకోడం లేదు’’ అని ప్రశ్నించారు.
పదేండ్లు ఏమి చేయని బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలే?
పదేండ్లు ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్‌ఎస్ వాళ్లకు ఇప్పుడెందుకు ఓట్లేయాలని సీఎం రేవంత్‌ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉంటే మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నరు. మిగతా మంత్రులను తోలు బొమ్మలను చేసి మీ ముగ్గురే కీలక శాఖల్లో కొనసాగిన్రు. కేటీఆర్ వల్లే మున్సిపాలిటీల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అధికారంలో ఉండి ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడు గెలిపిస్తే ఎలా అభివృద్ధి చేస్తారు?’’ అని ప్రశ్నించారు.
‘‘ఈ మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదు. బరితెగించిన కోడి బజారులో గుడ్డు పెట్టినట్లు కేటీఆర్, హరీశ్‌రావు తీరు ఉంది. పదేండ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్‌తో పేదలకు ఏం చేశారో చెప్పాలి? కేసీఆర్ మనవడు ఏ బియ్యం తింటే ప్రజలకు అదే బియ్యం ఇస్తాం అన్నారు. కానీ ఇవ్వకుండా మోసం చేశారు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఏనాడైనా అసెంబ్లీకి వచ్చారా? ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నారు గానీ ఆ బాధ్యతను నెరవేర్చట్లేదు’’ అని మండిపడ్డారు.
మొన్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా మారిందన్నారు. అయినా మున్సిపల్ ఎన్నికల్లో కనీస బాధ్యత లేకుండా కేటీఆర్, హరీశ్‌రావు గంజాయి, డ్రగ్స్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్ వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పదేండ్లలో ఎన్నో స్కాములు చేశారు. చివరకు భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లను కూడా ట్యాప్‌చేసి విన్నారు. ఎంతో మంది వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు వసూలు చేశారు’’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో సకలదరిద్రాలకు కారణమైన బీఆర్ఎస్‌ను యాసిడ్ పోసి కడగాలని ఫైర్అయ్యారు. అప్పుడే రాష్ట్రానికి పట్టిన పీడ వదులుతుందన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆరెస్ మొక్కను మొలవనివ్వొద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రధాని మోదీ అంటారు. మీకు చేతగాకపోతే మాకు అప్పగించండి 48 గంటల్లో అరెస్టు చేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అందుకే కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించాం. ఇప్పటికి ఆర్నెళ్లు అవుతున్నా విచారణ ప్రారంభించలేదు.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను ఈడీ అరెస్ట్ చేయలేదు.. దీనిపై కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు?’’ అని సీఎం రేవంత్ నిలదీశారు. 2014 నుంచి-2019 వరకు రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదని, ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు రాజ్యసభలో బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ గుర్తుచేశారు.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలుసహా ప్రజలకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ప్రతి చట్టాన్ని బీఆర్‌ఎస్ సమర్థించిందని తెలిపారు. ‘‘నరేంద్ర మోదీ ప్రేమలో అమరత్వం పొందుతానని గతంలో కేసీఆర్ చెప్పారు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతున్నది’’ అని సీఎం ఫైర్అయ్యారు.
హామీలు నిలుపుకున్నందుకే కాంగ్రెస్‌కు ఓటేయాలి..
రెండేండ్లలో ఒక్కో హామీ నిలుపుకుంటున్నందునే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేయాలని సీఎం రేవంత్ సూచించారు. ‘‘మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలివ్వడం మొదలుపెట్టాం. బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలివ్వలేదు. బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మభ్యపెడ్తే.. మేం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం.
వాళ్లు బంద్పెట్టిన రేషన్‌కార్డులు ఇచ్చాం. ఉచిత సన్నబియ్యం ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల కు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. రైతు రుణమాఫీ కింద రూ.21వేల కోట్లు చెల్లించాం. రైతు భరోసా ఇస్తున్నాం. సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నాం. పండించిన ప్రతీ గింజను కొంటున్నాం.
మేం అధికారంలోకి వచ్చాక ఇప్పటికి70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వందేండ్లలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం. 40 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం’’ అని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అందువల్ల ఏ పార్టీకి ఓటేస్తే తెలంగాణ సమాజానికి మేలు చేస్తుందో ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తిచేశారు.
2027 దాకా కొత్త జిల్లాల్లో మార్పుచేర్పులుండవు
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2027 వరకు కొత్త జిల్లాల ఏర్పాటు లేదంటే మార్పులు చేర్పులు సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త జిల్లాలను తొలగిస్తారన్న ఆరోపణల్లో వాస్త వం లేదన్నారు. 2026లో జరగబో యే జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంద ని, 2029 లోనే సాధారణ ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడ్డారు.
‘‘ప్రధాని మోదీ తీరును చూస్తుంటే ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తున్నది. అప్పుడే మహిళా రిజర్వే షన్లు కూడా అమల్లోకి వస్తాయి. మోదీ ఏ ప్రాతిపది కన నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. తిరుమల తరహాలో తెలంగాణలోని అన్ని దేవాలయాలకు కేవలం ‘విజయ డెయిరీ’ నుంచి మాత్రమే నెయ్యిని సేక రించాలని నిర్ణయిం చాం. అజారుద్దీన్‌ను ఎమ్మె ల్సీగా నియమించి మంత్రి వర్గంలోకి తీసుకోవా లన్న కేబినెట్ తీర్మా నం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.
మున్సిపల్ వ్యవహారాల్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సేవలను వాడుకుం టాం. ఆయనకు కేవలం అభి వృద్ధి బాధ్యతలు మాత్రమే అప్పగిస్తాం’’ అని ఆయ నను మంత్రిని చేస్తానన్న ఊహాగానాలకు సీఎం తెరదించారు. ఇక కవిత అంశం పూర్తిగా వారి కుటుంబ వ్యవ హారమని, అధికారం చేతిలో ఉన్న ప్పుడు కలిసుం డి, అధికారం పోగానే ఒకరిపై ఒక రు నిందలు వేసుకుంటున్నారని సీఎం పేర్కొన్నా రు.
గత ఎన్నికల్లో వారంతా ఐక్యంగా ఉన్నప్పుడే తాను చిత్తుగా ఓడించానని, ఇప్పుడు వారు విడిపోయి నా తమకేం నష్టం లేదన్నారు. కేటీఆర్ తన భాష పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. గతంలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ ఎలాంటి భాష వాడారో సీఎం గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితు డు ప్రభాకర్ రావును బీజేపీ ప్రభుత్వం అమెరికా లో దాచిపెట్టిందని సీఎం సంచలన ఆరోపణ చేశారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు ఆయనను తీసుకురావడానికి వీలుకాలేదని, అందుకే కేసు విచారణకు ఇన్ని నెలల సమయం పట్టిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
