బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లా.. స్టార్ట్ అయినప్పుడు లక్ష కోట్లునే..

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లా.. స్టార్ట్ అయినప్పుడు లక్ష కోట్లునే..

అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వ్యయాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం.  మొదట రూ. లక్ష కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఇప్పుడు రూ. 2.1లక్షల కోట్లకు సవరించింది.  508 కిలోమీటర్ల హై స్పీడ్ రైలు మార్గానికి సంబంధించి సవరించిన వ్యయాన్ని ఆమోదం కోసం ప్రతిపాదనను మంగళవారం ( ఆగస్టు 25 ) కేంద్ర క్యాబినెట్ ముందు తీసుకొచ్చింది ప్రభుత్వం. మహారాష్ట్రలో భూసేకరణకు పడుతున్న సమయం, జపాన్ నుంచి రైలు సెట్లు రావడంలో జాప్యం వంటివి వ్యయ పెరుగుదలకు గల ప్రధాన కారణాలలో ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, కారిడార్‌లోని మొదటి దశ 2027 ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు అధికారులు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే అదనపు నిధులలో అధిక భాగం బడ్జెట్ నుంచే వస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, బడ్జెట్ కేటాయింపుల ద్వారా రూ.1.1 లక్షల కోట్లు సమకూరినట్లు తెలిపారు అధికారులు.

హై-స్పీడ్ రైళ్లను భారతదేశంలోనే తయారు చేస్తామని, వీటిలో ఒక్కో రైలుకు సుమారు రూ. 390 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఖర్చవుతుందని రైల్వే శాఖ తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : అది ఫ్లైట్ అనుకున్నారా...? ప్యాసెంజర్ రైలు అనుకున్నారా...?

ప్రాజెక్టు వ్యయం సుమారు 83 శాతం పెరిగి రూ. 1.98 లక్షల కోట్లకు చేరిందని గతంలోనే తెలిపారు రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్ సతీష్ కుమార్. భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతులు, రైళ్లను ఖరారు చేయడంలో జాప్యంతో సహా అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు కాలపరిమితి, పెరిగిందని అన్నారు.