ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి సత్తాచాటింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి యూనివర్సిటీగా నిలిచింది. విద్య, పరిశోధన రంగాల్లో తనదైన విశిష్టతను నిలబెట్టుకుంటూ మరోసారి అగ్రశ్రేణి ర్యాంకులతో సత్తా చాటింది. 2026 సంవత్సరానికి గానూ వెలువడిన ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సర్వేల్లో ఓయూ అత్యుత్తమ స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ జాతీయ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక తెలంగాణ విశ్వవిద్యాలయం కావడం విశేషం. రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో ఓయూ సాధించిన విజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల వెలువడిన ఇండియా టుడే బెస్ట్ యూనివర్సిటీస్ సర్వే 2026 ప్రకారం, దేశంలోని అగ్రగామి జనరల్ (ప్రభుత్వ) విశ్వవిద్యాలయాల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 4వ ర్యాంక్ సాధించింది. బోధనా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు, అకడమిక్ నిర్వహణలో తనకున్న ఆధిపత్యాన్ని ఓయూ మరోసారి నిరూపించుకుంది.
ఇదే కాకుండా మరో ప్రధాన గుర్తింపుగా... ఔట్‌లుక్-ఐకేర్ ర్యాంకింగ్స్ 2026లో... టాప్ 75 స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ విభాగంలో ఓయూ 13వ ర్యాంక్ సాధించింది. పరిశ్రమల భాగస్వామ్యం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు (లర్నింగ్ అవుట్‌కమ్స్), వైవిధ్యత వంటి అంశాల్లో ఓయూ ప్రతిభకు ఇది నిదర్శనం అని వీసీ అన్నారు.
విశ్వవిద్యాలయ విజయాలకు మరింత శోభను చేకూరుస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల (యుసిఇ-ఓయూ) జూలై 17, 2026న వెలువడిన ఔట్‌లుక్-ఐకేర్ ర్యాంకింగ్స్ 2026లో టాప్ 25 ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థల విభాగంలో 18వ ర్యాంక్ దక్కించుకోవడం గమనార్హం.
విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది సమిష్టి కృషికి విజయాలు అంకితమని ఈ సందర్భంగా వీసీ ఆచార్య కుమార్ మొలుగరం అన్నారు. ఈ సందర్భంగా భాగస్వాములందరికీ అభినందనలు తెలిపారు. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థుల నిరంతర కృషి, మేధో సంపత్తి, అంకితభావానికి ఈ ర్యాంకింగ్స్ ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు.
ఈ విజయం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదని.. పరిశోధన, బోధన, ప్రపంచ స్థాయి ఆవిష్కరణలలో మన ప్రమాణాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి లభించిన గొప్ప ప్రోత్సాహంగా అభివర్ణించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని విద్యా దివ్యధామంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
