మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ యాక్షన్ డ్రామా ' ఇరుముడి '. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల కబ్ లో చేరి రవితేజ కెరీర్ లోనే అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఒక సాలిడ్ హీట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా కోరిక నెరవేరింది.
అయితే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ మూవీ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ( APTF ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఉపాధ్యాయ వృత్తిని, ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను కించపరిచేలా కొన్ని సన్ని వేశాలు ఉన్నాయని మండిపతుతోంది. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు ఈ అంశంపై జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ మేకర్స్‌పై నిప్పులు చెరిగారు.
సినిమా అనేది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. అయితే ఈ ' ఇరుముడి'లో లేడీ టీచర్ పాత్రను అత్యంత నెగిటివ్ గా , అనైతిక ప్రవర్తన కలిగిన వారిగా చూపించడం సరికాదంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా అంతేకాకుండా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 'సీలేరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల' పేరును నేరుగా వాడటంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేసుకునే యూనిఫాంలనే ఉపయోగించడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇలా నిజమైన గుర్తింపులను చూపిస్తూ ఉపాధ్యాయ వ్యవస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించడం దారుణమని ఏపీటీఎఫ్ మండిపడుతోంది. వెంటనే ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి డిలీట్ చేసి.. టీచర్ల సమాజానికి చిత్రబృందం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగుతామని ఏపీటీఎఫ్ హెచ్చరించింది.
మరోవైపు.. ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ, తాను కూడా గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశానని చెప్పుకొచ్చారు. సమాజంలో ఉండే లోపాలను, వృత్తిలోని డార్క్ సైడ్‌ను మాత్రమే చూపించానని సక్సెస్ మీట్‌లో తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న సమయంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మరి ఈ కాంట్రవర్సీ ఎటు దారితీస్తుందో..'ఇరుముడి' టీమ్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి...
