ఎవరైనా సరే పార్టీ లైన్ దాటొద్దు : మల్లు రవి

ఎవరైనా సరే  పార్టీ లైన్ దాటొద్దు : మల్లు రవి

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణే అత్యంత విలువైనదని, పార్టీ లైన్ దాటి ఎవరికైనా ఇబ్బందికరంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు.

మంత్రి కొండా సురేఖపై, చిన్నారెడ్డిపై  చర్యలు  తీసుకోవాల్సిందిగా తాము హైకమాండ్‌కు నివేదిక అందించినట్లు ఆయన తెలిపారు. వీరిద్దరి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తోందని, ఇలాంటి వ్యవహార శైలి పార్టీకి తీవ్ర నష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పూర్తి అంశాన్ని టీపీసీసీ చీఫ్ ద్వారా పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి దృష్టికి తీసుకెళ్లామని, అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తుందని ఆయన  అన్నారు. 

మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరి ప్రవర్తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని భావించిన కమిటీ  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి నివేదిక అందించింది. కాసేపట్లో  కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు.