రైతులకు పంపిణీ చేయక.. పట్టించుకోక.. వేములవాడ రాజన్న గోశాలలో ఐదు కోడెలు మృతి

రైతులకు పంపిణీ చేయక.. పట్టించుకోక.. వేములవాడ రాజన్న గోశాలలో ఐదు కోడెలు మృతి

వేములవాడ రాజన్న గోశాల తీరు మారటం లేదు. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, సంరక్షణ లేకపోవడం,  పరిశుభ్రంగా ఉంచకపోవడం మొదలైన కారణాలతో ఇప్పటికే పలుమార్లు గోశాలలో పశుములు మృతిచెదిన ఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. మరోసారి 5 కోడెలు మృతి చెంది అలాంటి ఘటనే పునరావృతం కావడం విమర్శలకు దారితీస్తోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న గోశాలలో 2026 ఆగస్టు 25న ఐదు కోడెలు మృతి చెందాయి.  తిప్పాపురంలోని రాజన్న గోశాలలో అనారోగ్యం కారణంగా కోడెలు చనిపోయాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న ముసురు కారణంగా పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. కోడెల ఆరోగ్యంపై నిర్వాహకుల నిర్లక్ష్యం మూలాన మూగజీవాలు కన్ను మూశాయి. 

గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. 250 కోడెల కెపాసిటీ ఉన్న గోశాలలో 460 కోడెలు ఉంచడంతోనే అవి మృత్యువాత పడినట్లు చెబుతున్నారు. అసలే వర్షాకాలం.. అందులో కనీసం అటు ఇటు కాలు కదుపటానికి కూడా స్థలం లేకుండా కోడెలను కుక్కడంతో తీవ్ర అనారోగ్యం పాలైనట్లు చెబుతున్నారు. 

కోడెలను ఆలయ అధికారులు  రైతులకు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ.. అధికారులు పంపిణీ చేయకపోవడం దారుణం అని అంటున్నారు. గతంలోను సకాలంలో రైతులకు పంపిణీ చేయకపోవడంతో పరిమితికి మించి కోడెలను గోశాలలో కుక్కడంతో  మృతి చెందిన ఘటనలు కోకొల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. 

అటు రైతులకు పంచకా.. ఇటు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించకా కోడెల మృతికి కారణమయ్యాయరని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా రైతులకు పంపిణీ చేయాలని  సంఘాల డిమాండ్ చేస్తున్నారు.