షుగర్.. అందరినీ భయపెడుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. WHO లెక్కల ప్రకారం ప్రపంచంలో 83 కోట్ల మంది షుగర్ బాధితులు ఉన్నారు. ఇక మన దేశంలో అయితే 18 ఏళ్లు నిండి వారు 7.7 కోట్ల మంది షుగర్ తో బాధపడుతున్నారు. మరోవైపు 2.5 కోట్లమంది ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నారు. దీంతోపాటు తమకు డయాబెటిస్ ఉన్నది అని తెలియనవారు 50 శాతం మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో షుగర్ కు చెక్ పెట్టేందుకు ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు పరిశోధకులు. నాన్ వెజ్ మానేసి భోజనం తీసుకునే సమయంలో మార్పులు చేసుకుంటే షుగర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అంటున్నారు. డిటెయిల్డ్ గా తెలుసుకుందాం..
టైప్ 2 డయాబెటిస్‌పై మానవ జన్యుశాస్త్ర పరిశోధికురాలు అనుభా మహాజన్ టీం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రతి రోజు లాక్టో వెజిటేరియన్ ఆహారం తీసుకుంటూ 14 గంటల పాటు రాత్రిపూట భోజనంలో గ్యాప్ ఇస్తే టైప్ 2 డయాబెటిస్ ఉన్న మహిళల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయని పరిశోధనలో తేలింది. 24 వారాల రీసెర్చ్ లో డయాబెటిస్ కు చికిత్స తీసుకుంటున్న వారితో పోలిస్తే చికెన్, మటన్ తినకుండా కేవలం వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న వారిలో HbA1c లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నాయట. దీంతోపాటు బరువు తగడ్డం, ఇన్సులిన్ అదుపులో ఉండటం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం హెచ్చరికలు కూడా తగ్గాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరిశోధనను దేశంలోని అనేక ప్రాంతాల్లో చాలా రీసెర్చ్ సెంటర్లలో ఓపెన్ లేబుల్ ట్రయల్స్ లో నిర్వహించారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 25నుంచి 60 ఏళ్ల వయసున్న 96 మంది మహిళలపై రీసెర్చ్ చేశారు. వీరికి డయాబెటిస్ చికిత్స లేకుండా 14 గంటల గ్యాప్ తో కూరగాయల భోజనం పెట్టారు. ఈ పరిశోధనలో పేషెంట్లకు మటన్, చికెన్ , చేపలు, గుడ్లు వంటి నాన్ వెజ్ మినహాయించి కూరగాయలు, పండ్లు, పప్పులు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు , పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఇచ్చారు.
ప్రతి రోజూ 10 గంటల వ్యవధిలోనే అంటే ఉదయం 9 గంటలనుంచి రాత్రి 7 గంటల మధ్య ఆహారం ఇచ్చారు. రాత్రి 7 గంటలనుంచి మరుసటి రోజు 9 గంటలవరకు అంటే 14 గంటలు వీరికి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా పరిశోధన జరిపారు. 96 మందిలో 90 మంది మహిళలు 24 వారాల అధ్యయనంలో పాల్గొన్నారు.
ప్రయోగం ముగిసే సమయానికి వీరిలో డయాబెటిక్ కు చికిత్స తీసుకుంటున్న వారిలో 7.65 శాతం HbA1c లెవెల్స్ ఉండగా.. పరిశోధనలో ప్రమేయం ఉన్న మహిళలల్లో 6.53శాతంగా ఉంది. రెండింటి మధ్య 1.12 శాతం పాయింట్ల వ్యత్యాసాన్ని కనిపించింది.
దీంతో పాటు బరువు తగ్గడం, BMI, భోజనంత తర్వాత గ్లూకోజ్, లిపిడ్ ప్రొఫైల్స్ లో కూడా చాలా మెరుగుదల కనిపించించింది. రాత్రిపూట ఉపవాసం, కూరగాయల భోజనం తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో జీవక్రియ మెరుగు పర్చుకోవచ్చని చెబుతున్నారు.
