- మూడో రౌండ్ లో జొకో,ఫెడరర్, సెరెనా
- బార్టీ, ఒసాకా, క్విటోవా కూడా
- ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: వయసు పెరుగుతున్నా.. తన ఆటలో సత్తా మాత్రం తగ్గడం లేదని నిరూపిస్తున్న స్విస్ స్టార్, మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో మూడోసీడ్ ఫెడరర్ 6–1, 6–4, 6–1తో ఫిలిప్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై గెలిచి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో గత 20 ఏళ్లుగా ఈ టోర్నీలో కనీసం థర్డ్ రౌండ్ చేరుకున్న ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 2000లో తొలిసారి మెల్‌బోర్న్ పార్క్‌లో బరిలోకి దిగిన ఫెడరర్.. 14సార్లు సెమీస్ అంతకంటే బెటర్ పెర్ఫామెన్స్ చూపెట్టాడు. కానీ ఒక్కసారి కూడా మూడోరౌండ్ కంటే ముందు వైదొలగలేదు. తాజా విజయంతో క్రాజినోవిచ్‌తో హెడ్ టు హెడ్ రికార్డును ఫ్రెడ్డీ 4–0కు పెంచుకున్నాడు. 2018 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం పోటీపడుతున్న ఫెడరర్.. కనీసం వామప్ మ్యాచ్ ఆడకుండానే బరిలోకి దిగాడు. అయినా అలుపన్నదే లేకుండా కుర్రాళ్లకు దీటుగా పోటీనిస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 13 గేమ్‌లు మాత్రమే చేజార్చుకున్నాడు.
వరుసగా మూడు..
ఓపెనింగ్ సర్వ్‌ను నిలబెట్టుకున్న ఫెడరర్.. సెకండ్ గేమ్‌లో క్రాజినోవిచ్ కొట్టిన బ్యాక్‌హ్యాండ్ లాంగ్ షాట్‌ను సూపర్‌గా రిటర్న్ చేసి సర్వ్‌ను బ్రేక్ చేశాడు. నాలుగో గేమ్‌లోనూ 40–అడ్వాంటేజ్ వద్ద బ్రేక్ పాయింట్‌ను కాచుకుని మళ్లీ క్రాజినోవిచ్ సర్వ్‌ను బ్రేక్ చేశాడు. ఫలితంగా 5–0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఏడో గేమ్‌లో 40–0 వద్ద సెట్ పాయింట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండోసెట్‌లోనూ ఫెడరర్ ఆధిపత్యమే నడిచినా.. క్రాజినోవిచ్ కాసేపు పోటీ ఇచ్చాడు. సెర్బియన్ సర్వ్‌ను బ్రేక్ చేసి ఫెడరర్1–0తో నిలిచాడు. తర్వాత ఇరువురు సర్వ్‌లను నిలబెట్టుకున్నా.. కీలకమైన ఐదో గేమ్‌లో రెండు బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న క్రాజినోవిచ్ ఆధిక్యాన్ని 2–3కు తగ్గించాడు. ఇక స్కోరు 3–4 ఉన్న దశలో ఫెడరర్ సర్వీస్‌లో రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన క్రాజినోవిచ్ స్కోరును 4–4తో సమం చేశాడు. కానీ తొమ్మిదో గేమ్‌లో సర్వీస్ కోల్పోవడంతో సెట్ చేజారింది. మూడోసెట్‌లోనూ క్రాజినోవిచ్ రాత మారలేదు. డబుల్ ఫాల్ట్స్‌తో ఫస్ట్ గేమ్ సర్వ్‌ను కోల్పోయిన సెర్బియన్.. ఐదు, ఏడో గేమ్‌ను చేజార్చుకుని మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–4, 6–2తో తట్సుమా ఇటో (జపాన్)పై, టామీ పాల్ (అమెరికా) 6–4, 7–6 (8/6), 3–6, 6–7 (3/7), 7–6 (10/3)తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై, పోగ్నిని (ఇటలీ) 7–6 (7/4), 6–1, 3–6, 4–6, 7–6 (10/3)తో థాంప్సన్ (ఆస్ట్రేలియా)పై, బటిస్టా అగట్ (స్పెయిన్) 5–7, 6–2, 6–4, 6–1తో మెహ్ (అమెరికా)పై, సంగ్రీన్ (అమెరికా) 7–6 (9/7), 6–4, 4–6, 2–6, 7–5తో 8వ సీడ్ బెరెట్టినీ (ఇటలీ)పై, సిలిచ్ (క్రొయేషియా) 6–2, 6–7 (6/8), 3–6, 6–1, 7–6 (10/3)తో 21వ సీడ్ పెయిరీ (ఫ్రాన్స్)పై, రావోనిక్ (కెనడా) 6–3, 6–4, 6–2తో గారిన్ (చిలీ)పై, మిల్‌మన్ (ఆస్ట్రేలియా) 6–4, 7–5, 6–3తో 31వసీడ్ హుర్కాజ్ (పొలెండ్)పై, ష్వార్జ్‌మెన్ (అర్జెంటీనా) 6–1, 6–4, 6–2తో ఫోకినా (స్పెయిన్)పై గెలవగా, సిట్సిపాస్ (గ్రీస్)కు వాకోవర్ లభించింది.
సెరెనా, గాఫ్ ముందంజ
మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో సెరెనా (అమెరికా) 6–2, 6–3తో జిద్నెస్క్ (స్లోవేనియా)పై గెలవగా, టీనేజ్ ప్లేయర్ కోరి గాఫ్ (అమెరికా) 4–6, 6–3, 7–5తో క్రిస్టీ (రొమేనియా)ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–4తో హెర్కాగ్ (స్లోవేనియా)పై, క్విటోవా (చెక్) 7–5, 7–5తో బడోసా (స్పెయిన్)పై, కీస్ (అమెరికా) 7–6 (7/3), 6–2తో రస్ (నెదర్లాండ్స్)పై, డిఫెండింగ్ చాంపియన్ ఒసాకా (జపాన్) 6–2, 6–4తో జెంగ్ (చైనా)పై, వొజ్నియాకి (డెన్మార్క్) 7–5, 7–5తో 23వ సీడ్ యస్ట్రేమస్కా (ఉక్రెయిన్)పై, జార్జెస్ (జర్మనీ) 4–6, 6–3, 7–5తో 13వ సీడ్ మార్టిచ్ (క్రొయేషియా)పై, నవారో (స్పెయిన్ ) 7–6 (8/6), 7–6 (8/6)తో 11వ సీడ్ సబాలెంకా (బెలారస్)పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి చేరారు.
‘మిక్స్‌డ్’కు సానియా దూరం
ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. కాలిపిక్క గాయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ నుంచి తప్పుకుంది. రోహన్ బోపన్నతో కలిసి సానియా ఈ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం యధావిధిగా బరిలోకి దిగనుంది. ఇక బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఇండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో దివిజ్ శరణ్–అర్టెమ్ సితాక్ (న్యూజిలాండ్) 6–4, 7–5తో బుస్టా (స్పెయిన్)–సౌసా (పోర్చుగీస్)పై గెలిచి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో బోపన్న–యసుతకా ఉచియమా (జపాన్) 1–6, 6–3, 3–6తో బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ (అమెరికా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.