నా వరకు తను కచ్చితంగా టాప్​ ఆల్​రౌండర్లలో ఒకడు

నా వరకు తను కచ్చితంగా టాప్​ ఆల్​రౌండర్లలో ఒకడు

‘నా వరకు తను కచ్చితంగా టాప్​ ఆల్​రౌండర్లలో ఒకడు. ఓసారి అతని పెర్ఫామెన్స్‌‌‌‌ చూడండి. ఒక మ్యాచ్‌‌లో 175 రన్స్‌‌ కొట్టి, తొమ్మిది వికెట్లు తీయడం మామూలు విషయం కాదు. ప్రతీ మ్యాచ్‌‌కు తను మెరుగవుతూనే ఉన్నాడు’..  శ్రీలంకతో తొలి టెస్టు తర్వాత  టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా గురించి కెప్టెన్​ రోహిత్‌‌ శర్మ అన్న మాటలివి. రోహిత్‌‌ మాత్రమే కాదు ప్రతీ క్రికెట్‌‌ అభిమాని అభిప్రాయమూ ఇదే.  జడ్డూ ఓ నిఖార్సైన ఆల్‌‌రౌండరే కాదు  టీమ్​కు ఓ వారియర్ కూడా . ​పేరున్న బ్యాటర్ కాకున్నా..  బాల్‌‌ను అతిగా తిప్పేసి మాయ చేయకపోయినా తన సామర్థ్యాన్నే నమ్ముకుని అతను ఓ స్టార్ ఆల్ రౌండర్‌‌గా ఎదిగాడు. అతని  ఫీల్డింగ్‌‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్రౌండ్‌‌లో అతడు ఎక్కడ ఉన్నా కనీసం 20 రన్స్ కాపాడుకోగలమనే ధీమా టీమ్​కు ఉంది.  వీటికి అదనంగా ఈ మధ్య  బ్యాట్‌‌తోనూ తన ‘రవీంద్రజాలం’ చూస్తున్నాం. శ్రీలంకతో తొలి టెస్టులో  జడ్డూలోని టాప్‌‌ క్లాస్‌‌ బ్యాటర్‌‌ నిద్రలేచాడు.  డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. టీమ్ విక్టరీనే ముఖ్యమని భావించిన అతడు డిక్లేర్ కోసం కెప్టెన్ రోహిత్ ను ఒప్పించి తనకు జట్టు ప్రయోజనలే ముఖ్యమని స్పష్టం చేసి మరిన్ని మార్కులు కొట్టేశాడు. అన్ని ఫార్మాట్లలో సూపర్‌‌గా ఆడుతున్న రవీంద్రపై  కెప్టెన్ రోహిత్ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నాడు. బ్యాటర్‌‌గా అతడి సేవలు మరింత వినియోగించుకుంటామని చెప్పాడు. దాంతో, బ్యాట్‌‌తోనూ జడ్డూ మరిన్ని రికార్డులు బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తుండగా..  టీమిండియా మిడిలార్డర్‌‌ సమస్యలు తీరినట్టే  అనిపిస్తోంది. కపిల్‌‌ దేవ్‌‌ తర్వాత ఆ స్థాయి పేస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ కోసం టీమిండియా ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. హార్దిక్​ కొంత కాలం ఆ బాధ్యతలు తీసుకున్నా.. గాయాల కారణంగా తను టీమ్​కు దూరమయ్యాడు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇలా సరైన పేస్‌‌ ఆల్ రౌండర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే జడేజా మాత్రం తన సూపర్ పెర్ఫామెన్స్​తో స్పిన్​ ఆల్​రౌండర్​గా దూసుకెళ్తున్నాడు.

బ్యాట్​తోనూ జోరు

బౌలర్‌‌‌‌గా నిరూపించుకున్న జడేజా  బ్యాటర్‌‌గానూ మెరుగవ్వడంతో జట్టు మరింత బలంగా మారింది.  ఈ ఐదేళ్లలో ఆడిన టెస్టుల్లో జడేజా 46.48 యావరేజ్ తో 1,441 రన్స్ చేశాడు. రోహిత్, కోహ్లీ మాత్రమే జడేజా కంటే ఎక్కువ యావరేజ్ తో ఉన్నారు. అలాగే నంబర్ 6 లేదా 7లో బ్యాటింగ్ కు వచ్చే జడేజా.. 43 ఇన్నింగ్స్ ల్లో 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐదేళ్లలో చేసిన 1,441 రన్స్ లో 551 టీమ్ ఆరు వికెట్లు కోల్పోయాక వచ్చినవే.  మొహాలీ టెస్టులోనూ ఐదు వికెట్లు కోల్పోయాక ఇండియా 223 రన్స్ చేయగా.. ఇందులో 140 రన్స్ జడేజావే.  కాగా, మూడేళ్లుగా టెస్టుల్లో ఇండియా 300కు పైగా పరుగులు చేయడంలో జడ్డూది కీలక పాత్ర. ఈ మూడేళ్లలో ఇండియా 300 లేదా అంతకుమించి రన్స్ చేసిన మ్యాచ్​ల్లో జడేజా ఒక్కడే 63.2 యావరేజ్ తో 1,074 పరుగులు  సాధించాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ 757 రన్స్ తో జడేజా కంటే వెనకే ఉన్నాడు. మొత్తానికి బ్యాటింగ్‌‌లోనూ తనపై భరోసా ఉంచే స్థాయికి ఎదిగిన జడేజా ఇదే జోరు కొనసాగించాలని ఆశిద్దాం.