V6 News

తమిళ సంస్కృతిపై దాడిని సహించం: RSS, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

తమిళ సంస్కృతిపై దాడిని సహించం: RSS, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

చెన్నై: బీజేపీ, ఆర్ఎస్ఎస్‎పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. శనివారం (ఏప్రిల్ 18) తిరువళ్లూరులోని పొన్నేరిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని రాహుల్ మాట్లాడుతూ.. తమిళనాడు భాష, సంస్కృతిని బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. తమిళ భాష, సంస్కృతిపై దాడిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. తమిళనాడుకు అన్యాయం జరిగితే తాను తమిళుడినై పోరాడుతానని అన్నారు. 

తమిళనాడుకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని.. గత కొద్ది సంవత్సరాలుగా ఆ రాష్ట్రంతో తన అనుబంధం మరింత బలపడిందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ తనకు ఎలా సొంత ఇల్లులా అనిపిస్తుందో, తమిళనాడు కూడా అంతేనని అన్నారు. డీలిమిటేషన్ తమిళనాడుతో సహా దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు దేశంలో సమాన ప్రాతినిధ్యంపై ప్రభావం చూపుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కాగా, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026, ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 2026, మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే పార్టీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. పోలింగ్ తేదీ దగ్గరపడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం ముమ్మరం చేశారు.