- లీటర్‌కు రూ.3 చొప్పున పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.107.50 నుంచి రూ.110.89
- డీజిల్ ధర 95.70 నుంచి 98.96 రూపాయలకు చేరిక
- రాష్ట్రంలోని వాహనదారులపై నెలకు రూ.117 కోట్ల అదనపు భారం
- ఆర్టీసీకీ ప్రతి నెలా రూ.5.5 కోట్ల అదనపు ఖర్చు
- రవాణా చార్జీల పెరుగుదలతో పెరగనున్న నిత్యావసరాల ధరలు
- భారం కానున్న ఆన్లైన్ డెలివరీ సేవలు
హైదరాబాద్, వెలుగు:ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో అందరూ ఊహించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి కేంద్ర, రాష్ట్ర పన్నులు, వ్యాట్కలిపి రాష్ట్రంలో పెట్రోల్ లీటర్‌కు రూ. 3.39, డీజిల్‌కు రూ.3.26 చొప్పున పెరిగాయి. ఈ రేట్లు శుక్రవారం తెల్లవారు జాము నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.107.50 నుంచి రూ.110.89కు, డీజిల్ ధర రూ.95.70 నుంచి రూ.98.96కు చేరింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో పెట్రోల్ ధరలు రూ.110 దాటడం వాహనదారులను బెంబేలెత్తిస్తోంది.
పెట్రో రేట్ల పెంపుతో రాష్ట్ర ప్రజలపై సగటున రోజుకు రూ.3.9 కోట్ల చొప్పున ప్రతి నెలా దాదాపు రూ.117 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత వాహనదారులతో ట్రాన్స్‌పోర్ట్ రంగం తీవ్ర ప్రభావానికి గురికానున్నాయి. ఫలి తంగా నిత్యావసరాల రేట్లు మరింత పెరుగుతాయని సామాన్యుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- రోజూ కోటీ 20 లక్షలలీటర్లకు పైగాఇంధన వినియోగం
రాష్ట్రంలో ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీఎల్‌కంపెనీలకు సంబంధించి దాదాపు 2,600కు పైగా పెట్రోల్‌బంకులు ఉన్నాయి. నిత్యం కోటి 20లక్షల లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్‌ను వాహనదారులు వినియోగిస్తున్నారు. ఇందులో సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల లీటర్లు డీజిల్ ఒక్క హైదరాబాద్‌లో వినియోగం జరుగుతోంది. సూర్యాపేట, చర్లపల్లి, ఘట్‌కేసర్ తదితర 6 కంపెనీ టెర్మినళ్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులకు ప్రతి రోజు 600 ట్యాంకర్లలో పెట్రోల్, డీజీల్‌సరఫరా జరుగుతోంది.
- సామాన్యులపై పెనుభారం..
పెట్రో రేట్ల పెంపువల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. తాజా పెంపుతో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్న రాష్ట్రాల జాబితాలోకి తెలంగాణ చేరింది. రాష్ట్రంలో సరుకు రవాణా అంతా లారీలు, వ్యాన్లు లాంటి డీజిల్ వాహనాల పైనే ఆధారపడి ఉంది. తాజాగా డీజిల్ రేట్లు పెరగడంతో ఆమేరకు యజమానులు రవాణా చార్జీలు పెంచే అవకాశముంది. ఇదే జరిగితే పాలు, పండ్లు, కూరగాలు, ఇతర నిత్యావసర సరుకుల రేట్లు పెరగనున్నాయి. బైకులు, కార్లు వినియోగించేవారి నెలవారీ పెట్రోల్ ఖర్చు పెరగడంతో పాటు ఆటో, క్యాబ్ ప్రయాణాలు మరింత భారం కానున్నాయి.
ఇప్పటికే కమర్షియల్గ్యాస్ ధరల పెంపు వల్ల హోటళ్లలో ఫుడ్చార్జీలు పెరగగా, తాజాగా పెట్రో, డీజిల్ రేట్ల పెంపువల్ల ఆన్లైన్ డెలివరీ సేవల కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఓలా, ఊబర్‌లాంటి ట్రాన్స్పోర్ట్యాప్లతో పాటు జొమాటో, స్విగ్గీ, జెప్టో లాంటి ప్రముఖ ఫుడ్, కిరాణా డెలివరీ యాప్ లు రాబోయే రోజుల్లో తమ డెలివరీ ఛార్జీలను సవరించే అవకాశం ఉంది. డీజిల్‌తో నడిచే ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రేట్లు పెరిగితే వ్యవసాయ పెట్టుబడులు పెరిగే ప్రమాదముందని రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
- ఆర్టీసీపైనా ప్రతినెలా రూ.5.5 కోట్ల భారం..
డీజిల్ ధరల పెంపు వల్ల తెలంగాణ ఆర్టీసీ పై ప్రతి నెలా సుమారు రూ. 5. 5 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 9,800 బస్సులు ఉండగా రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం లీటర్డీజిల్పై రూ.3.26 చొప్పున పెరగటంతో రోజుకు రూ.18 లక్షల చొప్పున భారం పడనుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ కింద 11శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ప్రతి నెలా రూ. 31. 47 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు లెక్కతేల్చారు.తాజాగా డీజిల్భారం కూడా తోడవడం గమనార్హం.
